పాస్‌పుస్తకాలకోసం డబ్బులడిగితె కఠిన చర్యలు

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
– రైతుల ఫిర్యాదుతో వీఆర్‌వో సస్పెండ్‌కు ఆదేశం
నిర్మల్‌, మే26(జ‌నం సాక్షి) : పాస్‌ పుస్తకాల్లో మర్పులు చేర్పుల కోసం, నూతన పాస్‌ పుస్తకాల పంపిణీ కోసం ఎవరైన డబ్బులు అడిగినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం నిర్మల్‌ జిల్లాలోని కౌట్లలో రైతుబంధు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పాస్‌ పుస్తకాలపై పేర్ల మార్పిడికి వీఆర్‌ఓ డబ్బులు అడుగుతున్నారంటూ గ్రామస్తులు మంత్రికి పిర్యాదు చేశారు. పలువురు డబ్బులు ఇచ్చి పేర్లు మార్పించుకుంటున్నారని, తమ పాస్‌ పుస్తకంలో పేర్లు తప్పుగా పడితే వాటిని మార్చాలని కోరితే రూ. 2వేలు ఇవ్వమని అంటున్నారని రైతులు మంత్రి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాస్‌ పుస్తకాల్లో పేర్లు మార్పిడికి అధికారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు అడిగిన ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అధికారులు రైతులకు మేలు జరిగేలా చూడాలని, అలా కాకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈసందర్భంగా అక్కడే ఉన్న వీఆర్‌ఓను మంత్రి నిలదీశారు. వెంటనే వీఆర్‌ఓను సస్పెండ్‌ చేయాలంటూ ఆర్డీఓకు మంత్రి ఆదేశించారు.

తాజావార్తలు