పిల్లల్ని కనడం తప్ప పనిలేదా?
బాబు వ్యాఖ్యలపై నారాయణ ఫైర్
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): బిజెపి ప్రభావంతోనే ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు క ఊడా చెబుతున్నారని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఒకనాడు గుంటూరు జిల్లా నరసారావుపేట సభలో ఎక్కువ మంది పిల్లల్ని కన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘వీరికేవిూ పనిలేదు పిల్లలను కనడం తప్ప’ అని చంద్రబాబు ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఇవాళేమో పిల్లల్ని కనండి అని అంటున్నారని అన్నారు. బహుశా కమలం నీడలో జ్ఞానోదయం కలిగినట్టుందని వివరించారు. పార్టీ కార్యాలయం మగ్దూమ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. హరికథలో ఉల్లిపాయ శాస్త్రం చెప్పినట్టు చంద్రబాబు ఈ విధంగా వల్లించడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీని ఎంత కాకా పట్టినా 2019 నాటికి టీడీపీకి బీజేపీ గోతులు తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా విధిలేని పరిస్థితుల్లో బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్నారని అన్నారు. అతి పొగడ్తలకు పోనవసరం లేదని హితవు పలికారు. ఇలాంటి వివాదాస్పద అంశాలను రాజకీయాల్లో రేకెత్తించడం ద్వారా అసలు సమస్యలను పక్కదారి పట్టించడమే అవుతుందని విమర్శించారు.