పిల్లల అనారోగ్యానికి

అద్దం పట్టిన కాగ్‌

దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం, నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడించిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని
ప్రపంచ ఆకలి సూచిక (జిఎచ్‌ఐ) ఆకలికి మూడు ప్రమాణాలను తీసుకుంటుంది. అవి 1) పోషకాహార లోపం; 2) బరువు తక్కువ పిల్లలు; 3) చిన్న పిల్లల మరణాల సంఖ్య స్థూలంగా చూస్తే, జిఎచ్‌ఐ సంఖ్యం తక్వువ ఉంటే, ఆ దేశంలో పేదరికం తక్కువ ఉన్నట్టు, ఆర్థికంగా ఎంతో ప్రగతిని సాధించినట్టు చాటుకంటున్న మన దేశం ఆకలిని మాత్రం జయించలేక పోతోంది. మన ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంక, చైనాల కంటే మనం ఎంతో వెనకబడిపోయా.
ప్రపంచ ఆహార సూచి (జిఎచ్‌ఐ)
అజర్‌బైజార్‌ – 5.0; చైనా – 5.1; మలేషియా-5.2; మారిషన్‌-5.7; ఎల్‌సాల్వడార్‌-5.8, దక్షిణాఫ్రికా-6.9; పాకిస్తాన్‌-19.7; నేపాల్‌-20.3; భారతదేశం-22.9, బంగ్లాదేశ్‌-24.0.
అంతర్జాతీయ ఆహార విదానాల పరిశోథన సంస్థ లెక్కల ప్రకారం రోజుకు 1800 కేలరీల కంటే తక్కువ ఆహారాన్ని తినే వారంతా పోషకాహార లోపానికి గురవుతున్నట్టే. ఆహారానిక దూరమవుతున్నట్టే. ఖాళీ కడుపులతో అలమటిస్తున్నట్టే.
ఇతర అంశాలను వెంటనే పట్టించుకోకపోయినా, కనీసం ఐసిడిఎస్‌ ద్వారా అయినా పోషకాహార  లోపాన్ని కొంత మేరకు నియంత్రించ వచ్చనుంకుంటే, దాని పని తీరు ఎంత అధ్వానంగా వుందో కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. నిజానికి అక్కడ అవినీతి రాజ్యమేలుతుంది. అంగన్‌వాడి కేంద్రాల్లో సరుకుల సరఫరా సక్రమంగా ఉండదు. కానీ, లెక్కల్లో ఏ లోపం కనబడదు. ఆయాలకి నెలనెలా ఇచ్చె కట్టెల బిల్లుల్లో అధికారులకి వాటా కావాలి. పిల్లల కోసం వచ్చే నూనె ప్యాకెట్లు  మాయమవుతున్నాయి. సకాలంలో సరుకు రవాణా కాని కారణంగా పిల్లలు నెలలో పదిహేను రోజులు ఆహారానికి దూరమవుతున్నారు. కానీ, లెక్కల్లో మాత్రం 25 రోజులు ఆహార పంపిణీ జరుగుతున్నట్టు ఉంటుంది. నెలవారీ మీటింగ్‌లకి హాజరయ్యే సిబ్బంది రవాణా ఖర్చులో కొంత భాగాన్ని నిర్వాహకులు కాజేస్తున్నారు. వేతనాలు పెరిగాయని ఆనందించే లోపే ఆ బిల్లులు చెల్లించడానికి 700 నుంచి 1000 రూపాయలు కమిషన్లుగా చేతులు మారుతాయి.

అందుకని, ముందుగా ఐసిడిఎస్‌ని ప్రక్షాళణ చేసి, నిధులను సక్రమంగా నినియోగించేలా చూడాలి. అలా ఆరేళ్ల లోపు వయసుగల పిల్లల పోషణపై కేంద్రీకరించింది, తీవ్రమైన పోషకాహార లోపం (శామ్‌) గల పిల్లల్ని గుర్తించి వారి ఆహారం, ఆరోగ్యం రెంటినీ పరిరక్షించే విధంగా పాటు పడాలి. వ్యవసాయాన్ని కూడా ఆహార లోపాన్ని తీర్చే విధంగా మెరుగుపరచాలి. పేద ప్రజల ఆహారపు అవసరాలను సక్రమంగా తీర్చాలి. ఆహార దాన్యాల నిల్వలను సమగ్రంగా వినియోగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థని సరిదిద్దాలి. సామూహిక పారశుధ్య పరిరక్షణ వైపు దృష్టి మళ్లించాలి. ప్రజారోగ్య వ్యవస్థలో ఆహారానికి ప్రాధాన్యత పెంచాలి. స్త్రీ పురుష వివక్షకి, కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడాలి, అప్పుడు మాత్రమే ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో 35 శాతానికి కారణమైన పోషకాహార లోపాన్ని తగ్గించగలం. లేకపోతే వారు చదువులో వెనకబడతారు. పేదరికం పెరుగుతుంది, వారు అనారోగ్యం పాలవుతారు. మతా శిశు మరణాల రేటు పెరుగుతుంది.
ఆహారంలో ఒక ఐరన్‌ (ఇనుము శాతం) లోపమే ఎంతో హాని చేస్తుంది. నిస్సత్తువ, మనసు నిలకడగా లేకపోవడం, పాలిపోయిన దేహం, ఆయాసం, రోగ నిదోధక శక్తి తగ్గడం, పేగుల్లో పుళ్లుపడి రక్తం చిమ్మడం, రుతుస్రావం ఎక్కువ కావడం, నరాల బలహీనత, గుండె దడ వంటి పరిణామాలకు స్త్రీలు, పురుషులు, పిల్లలు సమానంగా బలవుతున్నారు. ఇంకా, జాతీయ ఆహార సంస్ధ (ఎన్‌ఐఎన్‌)అంచనా ప్రకారం 40 శాతం పోషకాలు ధాన్యం నించి పొందాలి, మిగిలిన పోషకాలు ధాన్యం వల్ల మాత్రమే పొందుతున్నారు. ఈ లోపాన్ని  సవరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. అలానే, మన శరీర రక్షణ వ్యవస్థకి అవసరమైన విటమిన్లు, ఖనిజాల లోపాన్ని ‘మరుగున పడిన ఆకలి’ (హిడెన్‌ హంగర్‌)గా గుర్తిస్తాం. అందులో మనది మొదటిస్థానం. దీని వల్ల మాతా శిశు మరణాల రేటు పెరుగుతోంది. ఈ లోపం ఉంటే పిల్లలు అవయవ దోశషంతో పుట్టవచ్చు. పైగా పుట్టిన పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండదు. మన ఆత్పాదకత పెరగదు. పేదరికం మాత్రం పెరుగుతుంది. ఇంకా బడికిపోని పిల్లల్లో ‘ఎ’ విఒటమనిణ్‌ లోపం ఎక్కువ కనిపిస్తుంది. సంవత్సరానికి 3,30,000మంది పిల్లలు దీనివల్ల చనిపోతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో 9 శాతం మంది అతిసార వ్యాధితో చనిపోతున్నారు. 60 శాతం గర్బిణీ స్త్రీలు, 63 శాతం పాలిచ్చే తల్లులు, 70 శాతం ప్రీస్కూలు పిల్లలు రక్తహీనతకి గురవుతున్నారు. 71శాతం ఇళ్లలో మాత్రమే ఆయొడిన్‌ ఉప్పు వాడుతున్నారు. అయొడిన్‌ తక్కువైతే మెదడు ఎదగదు.

మనకి జబ్బు ఏమిటో తెలుసు. దానికి కారణం తెలుసు. నివారణకి కావలసిన వనరులున్నాయి. కానీ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనే చిత్తశుద్ది మాత్రం లేదు. అందుకే, ఎన్ని పథకాలు రచించినా ఎంత సొమ్ము కేటాయించినా, ఎన్ని నియంత్రణలు చేపట్టినా, అవన్నీ అవినీతి, లంచమనే మహా ప్రవహాంలో కొట్టుకుపోతున్నాయి. చివరికి సిగ్గు చేటయిన కాగ్‌ నివేదికలు మిగులుతున్నాయి.

మన పరకొండవ పంచవర్ష ప్రణాళిక (2007-2012) లో పెట్టుకున్న లక్ష్యాల ప్రకారం 2012 నాటికి మూడేళ్ల లోపు పిల్లలోల పోషకాహార లోపాన్ని,  పిల్లల్లో, స్త్రీలలో రక్తహీనతని  సగానికి తగ్గించాలి.లింగ వివక్ష వల్ల ఆడపిల్లలు, స్త్రీలు ఆహార లేమికి, అన్ని విధాలైన లోపాలకు గురికావడాన్ని  తగ్గించాలని 12వ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదించింది. ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఆహార లేమికి, ఇద్దరిలో ఒకరు రక్తహీతకు గురవుతున్నారు కాబట్టి, ప్రాధమిక విద్యపై కేంద్రికరించాలని, యుక్త వయసు పిల్లల్లో రక్తహీనతని తగ్గించి, గర్బిణీ స్త్రీల పరిరక్షణ పెంపచాలని ప్రతిపాదించింది.

జీవించాలనే ప్రథమిక హక్కుకి బాలలు దూరం కాకూడదు. ఆ జీవితానికి అవసరమైన పోషకాలన్నీ వారికి అందాలి. పిల్లల్లో, స్త్రీలల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తే అది ఈ తరానికే కాకుండా ముందు తరాలకి కూడా బంగారు బాట వేసినట్టు అవుతుంది.

అంతటి ప్రయోజనం గల సమగ్ర శిశు అభివృద్ది పథకాన్ని ఇలా దిగజార్చయడం నేరం. ప్రభుత్వం ‘కుపోషన్‌ భారత్‌ ఛోడొ’ అంటూ నినదించినంత మాత్రానా పోషకాహార లోపం తోక ముడిచి పారిపోదు. ఆహార భద్రత, వ్యవసాయానికి సరైన గిట్టుబాటు ధరలు, వ్యవసాయరంగ అభివృద్ది, ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగుదల, ఆహారానికీ, ఆరోగ్యానికీ నిధుల కేటాయింపులు పెంచడం, మెరుగైన ఆరోగ్య వ్కవస్థ, పోషకాలు కలిగిన అదనపు ఆహార పంపిణీ, టీకాలు, పారిశుద్ద్యం వగైరా నియంత్రణలు, అవినీతి లేని స్వచ్చమైన పాలన, ప్రజల ఆర్ధిక పరిస్థితుల మెరుగుదల, పేదరికం నిర్మూలన మాత్రమే సమస్యని పరిష్కరించగలవు. పథకాల రచనచాలదు, వాటి అమలులో పారదర్శకత, చిత్తశుద్ది, ప్రజలకి సంజాయిషీ ఇవ్వగల ధైర్యం ఎంతో అవసరం.

అప్పుడే శిశు మరణాలు తగ్గుతాయిపోషకాహార లోపం, రక్తహీనత మాయమవుతాయి. పురిటికందులు పెరిగి పెద్దవుతారు. వమసుకి తగిన బరువుతో తెలివిగా పైకొస్తారు ఐదేళ్ల లోపు పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలా, మన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడిన నాడు మాత్రమే మన పిల్లలు కిలకిల నవ్వుతారు. సరైన ఆహారం అంది కళకళలాడుతారు. చెంగు చెంగున తుళ్లుతూ ఆడుకుంటారు. ఆ పిల్లల చిరునవ్వు మాత్రమే మన చేతలకి, పథకాలకి ప్రమాణిక సూత్రం కాగలదు.