పిల్లల ఎగుమతి ముఠా నాయకుని అరెస్ట్‌

– 300మంది పిల్లలను అమెరికాకు ఎగుమతి చేసిన ముఠా
– పిల్లలంతా గుజరాత్‌లోని పేద కుటుంబాలవారే
– నటి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
ముంబయి, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : పిల్లల ఎగుమతి ముఠా సూత్రదారుడిని ముంబయి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 300 మంది పిల్లలను అమెరికాకు ఎగుమతి చేశారు. ఒక్కొక్కరికి రూ.45 లక్షల వరకు వసూలుచేశారు. అమెరికాకు అమ్మేసిన ఆ పిల్లలు ఏమయ్యారో తెలియదు. అసలీ పిల్లల అమ్మకం ఎందుకు జరిగిందనేది కూడా బయటకు రాలేదు. ఈ ఘోరానికి ఒడిగట్టిన ముఠా సభ్యులు కొందరిని గత మార్చిలో అరెస్టు చేశారు. ఇప్పుడు సూత్రధారి పట్టుబడ్డాడు. ఈ వ్యవహారమంతా వెనుకనుండి నడిపించిన రాజూభాయ్‌ గమ్లేవాల్‌ అనే గుజరాతీని ముంబై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు 11-16 సంవత్సరాల మధ్యవయసు గల పిల్లలను కనీసం 300 మంది పిల్లలను అమెరికన్లకు అమ్మేశారు. ఆ పిల్లల్లో ఎక్కువమంది గుజరాత్‌లోని నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వీరికోసం పాస్‌పోర్టులు అద్దెకు తీసుకునేవారు. ముఖకవళికలు దగ్గరగా ఉన్న చిన్నారుల పాస్‌పోర్టులు సేకరించి పిల్లలను అమెరికాకు రవాణా చేసేవారు. తరలింపు సమయంలో పిల్లలు పాస్‌పోర్టుపై ఉన్న చిన్నారులను పోలిఉండేలా మేకప్‌ కూడా వేసేవారు. పిల్లల రవాణా తర్వాత పాస్‌పోర్టులను వెనుకకు తెప్పించి సొంతదారులకు ఇచ్చేసేవారు. అయితే తిరుగు ప్రయాణంలో పిల్లలు లేకుండా పాస్‌పోర్టుపై ముద్రలు ఎవరు, ఎలా వేశారనేది ఇంకా తేలలేదు. గతమార్చిలో అనూహ్యంగా ఈ రాకెట్‌ బయటపడింది. సినీనటి ప్రీతి సూద్‌కు ఎవరో ఫోన్‌ చేసి వెర్సోవాలోని సెలూన్‌లో ఇద్దరు చిన్నారులకు మేకప్‌ చేస్తున్నారని సమాచారం అందించారు. నేను అనుమానంతో అక్కడికి వెళ్లాను.. మొదట ఆ అమ్మాయిలను వేశ్యావాటికలకు అమ్మేందుకు సిద్ధం చేస్తున్నారేమో అనుకున్నా.. కానీ వాకబు చేస్తే అసలు సంగతి తెలిసింది అని ప్రీతి చెప్పారు. మేకప్‌ వేయిస్తున్నవారు పిల్లలను అమెరికాలోని వారి తల్లిదండ్రుల వద్దకు పంపిస్తున్నామని బుకాయించారు. అనుమానం విూద పోలీసులను పిలిపించారు. ఇద్దరు పట్టుబడగా మూడోవ్యక్తి అమ్మాయిలతో సహా పారిపోయాడు. తర్వాత ఓ రిటైర్డు సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ కుమారునితో సహా మరో నలుగురిని ప్రీతి అరెస్టు చేయించారు.