పీఎస్ఎల్వీ సీ 27 విజయవంతం

1h6tonvbపీఎస్ఎల్వీ సీ27 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఈ రాకెట్ ఇండియా రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్) 1డి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీని బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహంతో దక్షిణాసియాలో నావిగేషన్, ట్రాకింగ్, మ్యాపింగ్ వ్యవస్థ మెరుగుపడనుంది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పడనుంది. దీనిద్వారా సముద్రంపై 20 మీటర్లు, భూమిపై 10 మీటర్ల పరిధిలో స్పష్టంగా చూడవచ్చు. ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహం పదేళ్లపాటు సేవలందించనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికాతో సమానంగా భారత్ కు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. విపత్తులు, ఓడలు, సముద్రంలో ప్రయాణించే ఇతర వాహనాలను ఈ శాటిలైట్ ద్వారా గుర్తించవచ్చు. నావిగేషన్ శాటిలైట్ల శ్రేణిలో ఇది నాలుగోది. 2016 కల్లా మొత్తం 7 నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించాలన్నది ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మరో రెండు శాటిలైట్లను కూడా ఈ ఏడాదే ప్రయోగించనుంది. కిరణ్ కుమార్ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి ప్రయోగం.