పీకే సినిమాపై వ్యాజ్యం కొట్టివేత
పరమత సహనం లేకపోవడాన్ని తుంచివేయాలి
ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు
దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
దిల్లీ, జనవరి 18(జనంసాక్షి): పీకే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పరమత సహనం లేకపోవడం సమాజానికి మంచిది కాదని, అలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచివేయాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పరమత సహనం దారుణంగా లోపిస్తున్న పోకడలను మొగ్గలోనే తుంచి పారేయాలని, ఇతర మతాల పట్ల అసహనం పెరిగిపోవడం కార్చిచ్చులా వ్యాప్తి చెందుతుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. దేశంలో ఈ తరహా పోకడల వ్యాప్తి భరింపశక్యం కాని విషయమని చీఫ్‌జస్టిస్. రోహిణి, జస్టిస్. ఆర్.ఎస్.ఎండ్లా సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. ఆమీర్‌ఖాన్ చిత్రం ‘పీకే’కు వ్యతిరేకంగా దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పరమత సహనం లోపిస్తున్నదనడానికి ఈ వ్యాజ్యమే సాక్ష్యమని పేర్కొంది.
సామాజిక పరమైన వాస్తవాలను ఓ కళాకారుడు చిత్రీకరించే హక్కును రాజ్యాంగం పరిరక్షిస్తుంది. ఆ చిత్రాన్ని చూడాలా/వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోవలసింది ప్రేక్షకుడే. ఎవరికైనా ఏ చిత్రాన్నైనా చూసినపుడు మనసు కష్టం కలుగుతుందని అనిపిస్తే…దానిని చూడకుండా ఉండే స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఉంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.