పీవీ ఆర్ధిక సంస్కరణల..
హైదరాబాద్, డిసెంబర్ 31 (జనంసాక్షి) :
మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు ఆర్థిక సంస్థల మాంత్రి కుడని, దేేశ ప్రగతికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొనియాడారు. భారతదేశ విదే శాంగ విధానంతో నూతన శకా నికి నాంది పలికిన గొప్ప దార్శనికుడని ఆయన అన్నారు. పీవీ భరతమాత ముద్దు బిడ్డ అని అన్నారు. ఆయన బహు భాష కోవిదుడే కాక అపర చాణక్యుడు అని అన్నారు. సోమవారం జూబ్లీహాల్‌లో హన్స్
ఇండియా, హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీవీ సంస్మరణ సభలో ఆయన స్మారకోపన్యాసం చేశారు. ఆర్థికాభివృద్ధిలో పీవీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. 1991నాటి ఆర్థిక పరిస్థితిని నేడు కనీసం ఊహించుకోలేమని ఆయన అన్నారు. రాజకీయ చతురత, ప్రభుత్వం ఏర్పాటులో గొప్పతనం ఆయనకే చెల్లిందన్నారు. నాడు పీవీ అమలు చేసిన ఆర్థిక విధానాల ఫలితాలనే నేడు మనం అనుభవిస్తున్నామని చెప్పారు. ఆసియా దేశాలతో సంబంధాల మెరుగుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఆసియా దేశాలతో సంప్రదింపుల స్థాయి నుంచి సదస్సులు నిర్వహించుకునే స్థాయికి సంబంధాలు మెరుగు పడటం వెనుక పీవీ కృషి ఎంతో ఉందన్నారు. సంస్కరణల తరువాత ఆసియా దేశాలతో సంబంధాలు ఎంతో మెరుగు పడ్డాయని అన్నారు. ఆ దేశాలతో అంచెలంచెలుగా సంబంధాల మెరుగుకు పీవీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం మన వ్యాపారాలలో అతి పెద్ద భాగస్వామ్యం ఆసియా దేశాలదేనని అన్నారు. ఆయన తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగు పరుచుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. సంక్లిష్ట సమస్యలు, సంక్షోభాలు పరిష్కరించడంలో ఆయన దిట్ట అని కొనియాడారు. సమస్యలు ఎలా అధిగమించాలో ఆయననుంచే నేర్చుకున్నామని చెప్పారు. పార్టీ క్లిష్ట సమయాలలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడిందన్నారు. 1970 నుంచి పీవీతో తనకు సంబంధాలు ఏర్పడ్డాయని, అప్పట్లో తాను జూనియర్ మంత్రిగా ఉన్నానని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. 1977లో పార్టీ, ఇందిరాగాంధీ ఓడిపోయిన సందర్భంలో పీవీతో పాటు తానుకూడా ఆమెకు బాసటగా నిలిచామన్నారు. గుర్తు చేశారు. ఆ సందర్భంలో ఉత్తరాదిన పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు దక్షిణాదిలో పార్టీ కొంత మేరకు విజయం సాధించిందన్నారు. సంక్షోభ సమయాల్లో ఇందిరా గాంధీ పక్కన నిలబడ్డ సీనియర్‌లలో పీవీ ఒకరని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను రాజకీయ సంప్రదాయాలకు భిన్నంగా కీలక సమయంలో ఆర్థిక మంత్రిగా చేసి రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచారన్నారు. ప్రజాసంక్షేమానికి అవసరమనుకుంటే ఎలాంటి కఠిన నిర్ణయాలైనా అమలు చేసేవారన్నారు. పంజాబ్ తీవ్రవాద సమస్య పరిష్కారంలో పీవీ రాజకీయ చతురత అమోఘమని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలేదని, రాష్ట్రపతి పాలన పొడిగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చిందన్నారు. లాంగోవాల్ హత్య తరువాత అకాలిదళ్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో ఆయనతో స్పానిష్‌లో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. పీవీ గొప్ప ప్రధాని. అలాంటి వ్యక్తి పేరిట స్మారకోపన్యాసాలు ప్రతియేటా జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలోి హెచ్‌ఎం టీవీ, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి, రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి, మీడియా హౌస్ చైర్మన్ వామన్‌రావు, రెసిడెంట్ ఎడిటర్ శైలజ వందన తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతిపై లోతైన అవగాహన : గవర్నర్
పీవీకి భారత సంస్కృతి సంప్రదాయాలపై లోతైన అవగాహన ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ అన్నారు. 16 భాషలలో పాండిత్యాన్ని సంపాదించిన పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన అన్నారు. ఆయన మితభాషి అయినప్పటికీ ఆయన మాటల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉండేందని అన్నారు. అన్ని రంగాలలో పీవీకి సమగ్ర అవగాహన ఉండేదన్నారు. పీవీతో ఆయనకు ఉన్న పరిచయాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్న సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. దేశం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నేడిలా నిలబడిందంటే అందుకు దివంగత ప్రధాని పీవీ, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ చలువేనని అన్నారు. ఆర్థిక రంగం చతికిల పడినప్పుడు రాజకీయ చతురతను ఉపయోగించి ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించారని కొనియాడారు. దివంగత ప్రధాని పీవీ గురించి చెప్పే అనుభవం, వయస్సు తనకు లేదంటూ ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయాన్ని ముఖ్యమంత్రి మననం చేసుకున్నారు.
మహా మనీషీ : రోశయ్య
పీవీ నర్సింహారావుతో తెలుగువారి గౌరవం ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడించిందని తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా అగ్రస్థాయికి ఎదిగిన మహామనీషి అని అన్నారు. బహుభాషా కోవిదుడైన నర్సింహారావు ఎన్ని ఒత్తిళ్లలోనైనా గ్రంథ రచనను సాగించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సంక్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మైనారిటీ ప్రభుత్వాన్ని చారిత్రక నిర్ణయాలతో విజయవంతంగా నడిపించిన సమర్థుడు రాజకీయ చతురుడు అని రోశయ్య అన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రావు, రాజేశ్వరరావు, రంగారావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చక్రపాణి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ, సీపీఎం కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.