పీసీబీ చైర్మన్‌ను కలిసిన కనేరియా బోర్డుకు క్షమాపణలు

లా¬ర్‌,డిసెంబర్‌ 1:  స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో నిషేధానికి గురైన పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా ఎట్టకేలకు పిసిబిని ఆశ్రయించాడు. బోర్డు ఛైర్మన్‌ జాకా అష్రాఫ్‌ను కలిసి క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లీష్‌ కౌంటీల్లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఇంగ్లాండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు కనేరియాపై నిషేధం విధించాయి. అయితే ఈ కేసుతో పాటు నిషేధానికి సంబంధించి కనేరియా పిసిబీకి ఎటువంటి వివరణ ఇవ్వకుండా , సహాయం కూడా కోరకుండా ఉన్నాడు. కేవలం తన సొంత లాయర్‌తో విచారణను ఎదుర్కొంటూ బోర్డును పట్టించుకోలేదు. దీంతో అతని వైఖరిపై అసంతృప్తితో ఉన్న పిసిబీ నిషేధం విషయంలో జోక్యం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కనేరియా పిసిబీతో మళ్ళీ సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా బోర్డు ఛైర్మన్‌ అష్రాఫ్‌ను కలిసి తన పరిస్థితి వివరించాడు. తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పడంతో పాటు బోర్డు విచారణకు హాజరవుతానని కోరాడు. కనేరియా వాదనతో ఏకీభవించిన పిసిబీ ఛైర్మన్‌ అష్రాఫ్‌ విచారణకు అనుమతించారు. దీని ప్రకారం డిసెంబర్‌ 10న జరగనున్న ఈసిబీ విచారణ సందర్భంగా పిసిబీ కూడా హాజరు కానుంది. 2009లో చోటు చేసుకున్న ఫిక్సింగ్‌ వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీనిలో వెస్ట్‌ఫీల్డ్‌ ఉధ్ధేశపూర్వకంగా ఒక ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు గానూ 6000 యూరోలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని కోర్టులో వెస్ట్‌ఫీల్డ్‌ అంగీకరించాడు. అలాగే విచారణలో తాను కనేరియా ప్రోత్సాహంతోనే ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతను సాక్ష్యమివ్వడం సంచలనమైంది. వెస్ట్‌ఫీల్డ్‌  చేసిన ఆరోపణలతో అప్పటి మ్యాచ్‌లతో పాటు కనేరియాను ఈసిబీ డిసిప్లినరీ ప్యానెల్‌ విచారించింది. విచారణలో ఆధారాలు లభించడంతో కనేరియాపై ఈసిబీ జీవితకాల నిషేధం విధించినట్టు ప్రకటించింది. తర్వాత బహిరంగ విచారణ కోసం కనేరియా అప్పీల్‌ చేశాడు. దీనిని లండన్‌ కోర్ట్‌ ఆఫ్‌ అర్బిట్రేషన్‌ అనుమతించడంతో ఈ నెల 10న విచారించనున్నారు. ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఈ పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ తనకు , తన కుటుంబానికి విచారణ చాలా ముఖ్యమైందని చెప్పాడు.