పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి
ఢిల్లీ,మే22(జనంసాక్షి):పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియామితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఆదివారం జారీ చేశారు. కిరణ్ బేడీ గతంలో ఢిల్లీ పోలీస్ శాఖలో పనిచేశారు. రిటైరైనా తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఘోర పరాజయం పొందారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ సీఎం క్రేజీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు.దీంతో కిరణ్ బేడీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే
ప్రసక్తే లేదని అప్పట్లో ఆమె స్పష్టం చేశారు. కానీ, ప్రజా సేవ మాత్రం చేస్తానన్నారు. ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఆమెకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. తాజా
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్, డీఎంకే కూటమి 17 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్న విషయం తెలిసిందే.
ఇదో అద్భుత అవకాశం: కిరణ్ బేదీ
పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్‌గా తనను నియమించడంపై ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేదీ ఆనందం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ బేదీని పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కిరణ్ బేదీ మాట్లాడుతూ.. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే జీవన పరమార్థమన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవన్నారు. ప్రభుత్వ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులో చాలా ఆనందం లభిస్తుందన్నారు. సేవచేసే ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని తాను అధికారంగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానన్నారు.