పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి ప్రమాణం

4

పుదుచ్చేరి,మే29(జనంసాక్షి): బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌బేడీ చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషేన్‌ కౌల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న వీరేంద్ర కటారియాను కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర నెల రోజుల వ్యవధిలోనే తొలగించింది. అప్పటినుంచి పూర్తి స్థాయి బాధ్యతలతో గవర్నర్‌ను నియమించలేదు. అండమాన్‌ నికోబార్‌ గవర్నర్‌ అదనపు బాధ్యతలతో పుదుచ్చేరిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్‌ బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా కేంద్రం నియమించింది.దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందిన 66 ఏండ్ల కిరణ్‌బేడీ ఢిల్లీలోని తీహార్‌ జైలు అధికారిగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1949, జూన్‌9న జన్మించిన ఆమె 1972లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2007లో ఆమె స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. అనంతరం అన్నాహజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కిరణ్‌బేడీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత విభేదాల కారణంగా బయటకు రావడంతో 2015లో జరిగిన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీలో చేరారు. సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ గెలవలేకపోయారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీకి మాత్రమే పరిమితమైన కిరణ్‌బేడీ ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమితులు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఐపీఎస్‌ అధికారిగా సేవలందించినందుకు ఐరాస నుంచి కూడా అవార్డును అందుకున్నారు. రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత అయిన కిరణ్‌బేడీ పలు పుస్తకాలను కూడా రచించారు. కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించడంపై సంతృప్తి వ్యక్తం చేసిన కిరణ్‌బేడీ.. దేశ అభివృద్ధిలో తన వంతు పాత్రను నిర్వహించాల్సిన బాధ్యతను కేంద్రం కల్పించిందని అన్నారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయబోనని పేర్కొన్నారు.

నాలుగో మహిళ

పుదుచ్చేరి నాలుగో మహిళా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడీ పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 1990లో చంద్రావతి బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆమె ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ వరకు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత రాజేంద్రకుమార్‌ బాజ్‌పాయి (1995-1998), రజనీరాయ్‌ (1998-2002) వరకు పనిచేశారు.