పునరుజ్జీవ పథకం వరప్రదాయిని
ఉమ్మడి ఆదిలాబాద్‌కు సాగు దశ పట్టిందన్న మంత్రి జోగు
ఆదిలాబాద్,జూన్29(జనం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అనేక విధాలుగా ఇప్పుడు ప్రయోజనాలు వస్తున్నాయని మంత్రి జోగురామన్న అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు ఉన్న అవగాహనతో పాటు ఆయన రైతాంగం కోసం చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు గోదావరికి మహర్దశ ఇవ్వనున్నాయని అన్నారు. ఎస్సారెస్పీ పురుజ్జీవ పథకం తెలంగాణ చరిత్రలో మైలురాయి వంటిదని మంత్రి జోగురామన్న అన్నారు. ఎస్సారెస్పీ పథకంతో తెలంగాణ ఉత్తర ప్రాంతానికి ఎంతో మేలు జరగగలదని అన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాజెక్టులకు వేసిన శంకుస్థాపన శిలాఫలకాలు సమాధి రాళ్లుగా మారితే… వాటన్నింటినీ పునరుద్ధిరించి కోట్లాది రూపాయలు వెచ్ఛించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపి భారీగా నిధులు ఖర్చుపెట్టి రైతాంగానికి సాగునీరు అందించిన తీరుగతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. మంచిర్యాల జిల్లాలో గొల్లవాగు ప్రాజెక్టుకు తెలంగాణ ఏర్పడక ముందు రెండు వేల ఎకరాలకు మాత్రమే నీరివ్వగా..తెలంగాణ ఏర్పాటు అనంతరం అదనంగా 4 వేల ఎకరాలకు నీరు అందించారని చెప్పారు. ర్యాలీవాగు ప్రాజెక్టు కింద గతంలో వెయ్యి ఎకరాలకు మాత్రమే నీరు అందగా… ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి చేసి అదనంగా 1428 ఎకరాలకు నీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. నీల్వాయి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదనంగా రూ. 31కోట్లు ఖర్చు చేసి 1500 ఎకరాలకు నీరు అందించారని చెప్పారు. కుమ్రంభీం ప్రాజెక్టు కింద అదనంగా 9,500 ఎకరాలు, మత్తడివాగు కింద 6,900 ఎకరాలకు నీరందించినట్లు వివరించారు. వడ్డివాగు కింద 9,500 ఎకరాలు, పాల్వాయి ప్రాజెక్టు కింద 5450 ఎకరాలు, గడ్డెన్నవాగు కింద 3వేల ఎకరాలు, సాత్నాల ప్రాజెక్టు కింద 6వేల ఎకరాలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 2,500 ఎకరాల అదనపు ఆయకట్టు సేద్యంలోకి రావడానికి ప్రభుత్వం చేసిన కృషి ప్రత్యక్షంగా నిపిస్తోందన్నారు. అలాగే పెనుగంగా, సదర్‌మాట్, స్వర్ణ నదులపై చెక్‌డ్యాములు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో డిసెంబర్ నాటికి ఇంటింటికీ తాగునీరు అందించి ప్రజారోగ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడ్డాయన్నారు.