పూజలు చేస్తే చంపేస్తారా?
– ఘటనపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తాం
– బీజేపీ నేత పరిపూర్ణానంద
వరంగల్, నవంబర్2(జనంసాక్షి) : పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాట్లాడితే బహిష్కరిస్తారా? పూజలు చేస్తే చంపేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన వరంగల్ పోచమ్మ మైదానం శివసాయి మందిరం అర్చకుడు సత్యనారాయణ అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. పూజారి స్వగ్రామం మొగిలిచర్లకు చేరుకున్న శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద అంత్యక్రియల్లో పాల్గొని పూజారికి నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగిలిచర్లకు వచ్చే మార్గంలో వందలాది మంది పోలీసులు అడ్డుతగిలారని.. తామంతా ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నామా? అని నిలదీశారు. నిందితుడిపై సమగ్ర విచారణ జరగడంతో పాటు మదర్సాలలో ఇలాంటి ఉన్మాదులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం
గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇళ్లల్లో పూజలు, పండుగలు చేసుకోవాలా? వద్దా? అని నిలదీశారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా తీవ్రమైన పోరాటం చేస్తామని పరిపూర్ణానంద ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్‌లోని శ్రీ శివసాయి మందిరం ప్రధాన అర్చకుడు సత్యనారాయణపై అక్టోబర్ 26న ఓ యువకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం 5.30 గంటలకు ఆలయంలో భక్తిగీతాలను మైక్‌లో ప్రసారం చేస్తూ సాయిబాబాకు హారతిస్తున్న అర్చకుడితో ఎల్‌బీనగర్(వరంగల్) ప్రాంతానికి చెందిన సయ్యద్ సాధిక్ హుసేన్ మైక్‌ను ఆపాలంటూ గొడవ పడి భౌతికదాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పూజారిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వయో వృద్ధుడైన పూజారిపై జరిగిన దాడితో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దాడిలో కాలేయం దెబ్బతిని తీవ్ర రక్తస్రావంతో పాటు ముఖంపై గాయాలవడంతో 5 రోజులు ఎంజీఎంలో చికిత్సపొందినా అర్చకుని ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మెరుగైన వైద్యం నిమిత్తం బుధవారమే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన మృతిచెందారు.