పూర్తి కావచ్చిన కమాండ్ కంట్రోల్ సెంటర్
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ
4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్,జూలై28(జనంసాక్షి ): శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ సిద్దమయ్యింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనినినిర్మించింది. దీంతో నగర సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ సీసీసీని ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐకానిక్ బిల్డింగ్‌గా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. దీంతో రాష్ట్రం మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. ఎక్కడ ఏం జరిగినా చిటికెలో తెలిసిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే రాష్టాన్రికి మూడో కన్నుగా భావించవచ్చు. ఏడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ బిల్డింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ మధ్యనే సీసీసీని పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆర్ అండ్ బీ, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్ కో, ఎల్ అండ్ టీతో పాటు నిర్మాణ పనుల్లో భాగస్వామ్యులైన డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమావేశమై పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చూసే బాధ్యతను కొందరు అధికారులకు అప్పజెప్పారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బిల్డింగ్ ను 1,12,077 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి అంగుళం 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. దీంతో రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏ, బీ, సీ, డీ అని నాలుగు టవర్లున్నాయి. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సాధారణ ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుంది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని వీక్షించొచ్చు. అయితే ఇందుకోసం ఛార్జీ వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఆరో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వెళ్లి బయట నుంచే పోలీసులు చేస్తున్న
ఆపరేషన్‌ను చూసే అవకాశంం కల్పించనున్నారు.