పెట్రోలింగ్ పోలీసులపై.. మద్యంప్రియుల దాడి?
– ‘ఖని’ కానిస్టేబుల్‌కు గాయాలు – పరారీలో నిందితులు
గోదావరిఖని, జూన్ 16, (జనంసాక్షి) : గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పెట్రోలింగ్ పార్టీపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు మధ్యం ప్రియులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ ముక్కుకు తీవ్రంగా గాయమైంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు… స్థానిక ఆర్టీసి బస్‌స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఉన్న పోలీసు పార్టీకి కొందరు మధ్యంప్రియులు కనిపించారు. ఎక్కడికని… వారిని హెడ్‌కానిస్టేబుల్ ప్రశ్నించగా… వారు అతనిపై ఎదురు తిరగగా… అడ్డొచ్చిన ఓ కానిస్టేబుల్‌పై మధ్యం ప్రియులు చేయి చేసుకున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోలింగ్ బృందం మూకుమ్మడిగా ఆ మందు ప్రియులను పట్టుకోవడానికి ప్రయత్నించగా… వారు కాళ్ళకు బుద్ది చెప్పారు. అయితే ఐదుగురున్న మధ్యం ప్రియుల్లో స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన ఒకరు పోలీసుల అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు.