పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి

– సీఎం ఫడ్నవిస్‌
ముంబయి, మే24(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలకు కళ్లెం వేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరగడం వల్ల తాము వివిధ పన్నులను తగ్గించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదన్నారు. ‘ఇప్పటికే మేము వివిధ పన్నులను చాలావరకు తగ్గించాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండడం వల్ల ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి పెట్రోల్‌ను జీఎస్టీ కిందికి తెచ్చేలా జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అప్పుడే పెట్రోల్‌ ధరలు దిగివస్తాయి…’ అని ఫడ్నవిస్‌ పేర్కొన్నారు. గతంలో కూడా పలువేదికలపై దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇదే అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.