పెథాయ్ ప్రభావంతో జిల్లాలో జోరుగా వర్షాలు
నీట మునిగిన పంటపొలాలు
ఖమ్మం,డిసెంబర్17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న పెథాయ్ తుపాను ప్రభావం తో తెలంగాణలో ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం తీరం దాటిన పెథాయ్ ప్రభావం మరో 24 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఇప్పటికే పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు. /ూష్ట్రంలోని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో జిల్లాలోని పలుచోట్ల ధాన్యం, వరి కుప్పలు తడిచాయి. ఆకస్మిక వర్షంతో తమ పంట మొత్తం నాశనం అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో వరిపంట దెబ్బతింటోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, రఘనాథపల్లి, వేలేరు, చిల్పూర్, ధర్మసాగర్ మండల్లాలో మోస్తరు వర్షం పడింది. భూపాలపల్లి, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, వాజేడు, పరకాల, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో వర్షం కురిసింది.