పెన్సిల్, రబ్బర్ దొంగలించాడని… విద్యార్థిని పొట్టనబెట్టుకున్న ప్రిన్స్‌పాల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్సిల్, రబ్బర్ దొంగలించడానే కారణంగా ఓ పాఠశాల ప్రిన్స్‌పాల్ మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొందరు విద్యార్థులు తమ పెన్సిళ్లు, రబ్బర్లు పోతున్నాయని క్లాస్ టీచర్‌కు చెప్పడంతో అతను విద్యార్థులందర్నీ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మృతుడితోపాటు మరో బాలుడి వద్ద కొన్ని రబ్బర్లు, పెన్సిళ్లు లభించాయి. దీంతో ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్ ఆ ఇద్దరినీ తీవ్రంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయని చెప్పారు. 
రేలమా ప్రాంతంలోని ద్వారకా ప్రసాద్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడ్ని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పెన్సిల్, ఎరాజర్ దొంగిలించాడనే నెపంతో తీవ్రంగా కొట్టాడు. దయలేని ఆ ప్రిన్సిపాల్ దెబ్బలకు తాళలేక తీవ్రంగా రోదించాడు. పాఠశాల ముగిసిన తర్వాత బాలుడు ఇంటికెళ్లిపోయాడు. కడుపు నొప్పిగా ఉందని చెప్పిన ఆ బాలుడి నోటి నుంచి రక్తం పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా, బాలుడు అప్పటికే మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రిన్సిపాల్ లలిత్ కుమార్ వర్మను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.