పెర్త్ టెస్ట్‌లో తొలిరోజు బౌలర్ల హవా సౌతాఫ్రికా 225 ఆలౌట్, ఆసీస్ 33-2
పెర్త్ ,నవంబర్ 30: సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టెస్టులో తొలిరోజు ఆస్టేల్రియాదే పై చేయిగా నిలిచింది. పూర్తిగా బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై సఫారీలను ఆతిథ్య జట్టు తక్కవ స్కోర్‌కే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ప్రారంభం నుండే తడబడింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతోన్న షేన్ వాట్సన్ ఆసీస్‌కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. సఫారీ కెప్టెన్‌ను తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు పంపాడు. తర్వాత సౌతాఫ్రికా వికెట్ల పతనం వేగంగా సాగింది. కేవలం 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆమ్లా 11, కల్లిస్ 2, డివిలీయర్స్ 4, స్మిత్ 11 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో డుప్లెసిస్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. పీటర్సన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పీటర్సన్ ఔటైనా… ఫిలాండర్‌తో కలిసి డుప్లెసిస్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు డుప్లెసిస్‌కు చక్కని సపోర్ట్ ఇచ్చిన ఫిలాండ్ 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే టెయిలెండర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 225 పరుగుల దగ్గర ముగిసింది. డుప్లెసిస్ 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ల్యాన్ 3 , జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. సఫారీలను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందంలో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కూడా తడబడింది. ఓపెనర్ ఎడ్ కొవాన్ డకౌటవగా… వాట్సన్ 10 రన్స్‌కే ఔటయ్యారు. తర్వాత డేవిడ్ వార్నర్ , నైట్ వాచ్‌మన్ నాథన్ ల్యాన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్టేల్రియా 2 వికెట్లకు 33 పరుగులు చేసింది.