పెళ్లిళ్లకు 150మందికే అనుమతి

ఖచ్చితంగా రూల్స్‌ పాటించేలా చూడాలి
అధికారులకు సిఎం జగన్‌ స్పష్టీకరణ
అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ పరిస్థితులపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే తెల్లవారు జామున జరిగే పెళ్లిళ్లకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు.వివాహ కార్యక్రమాల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నిర్దేశిరచిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదని చెప్పారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. ఆస్పత్రుల్లో నాడు ? నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలనకోసం రెండు కొత్త వెబ్‌సైట్లు డిజైన్‌ చేసినట్లు
సమావేశంలో సీఎం జగన్‌ తెలిపారు.పాఠశాలల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూళ్లలో కోవిడ్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు.