పేదరికం, నిరుద్యోగ నిర్మూలనే యూపీఏ లక్ష్యం
విపక్షాలపై పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రధాని
చురకలు, ఛలోక్తులతో జోరుమీద మన్మోహన్
న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి):
దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధీస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయని తేల్చిచెప్పారు. సంస్కరణల అమలులో ఎలాంటి మార్పుల్లేవన్నారు. కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్ధి బాట పట్టిందని, తొంభైలలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా అభివృద్ధి పథం వైపు సాగామన్నారు. విపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఎదురుదాడి కొనసాగించారు. రెండ్రోజుల క్రితం లోక్‌సభలో బీజేపీపై విరుచుకుపడ్డ మన్మోహన్.. రాజ్యసభలోనూ దాన్ని కొనసాగించారు. ప్రధానంగా విపక్ష నేత అరుణ్‌జైట్లీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పనితీరును అంచనా వేయడంలో మరింత ఆశావాహ దృక్పథంతో ఉండాలని హితవు పలికారు. ప్రతీ అంశాన్ని విమర్శించడం మానుకోవాలని చురకంటించారు. 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధిస్తే పేదరికం తగ్గుతుందన్న ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. పేదరికాన్ని తగ్గించాలన్నది యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని’ అన్నారు. 90లలో కాంగ్రెస్ సంస్కరణలకు తెరలేపిందని.. తద్వారా దేశం అభివృద్ధిబాట పట్టిందన్నారు. సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. ‘ప్రభుత్వ పనితీరును అంచనా వేయడంలో జైట్లీ మరింత ఆశావాహ దృక్పథంతో ఉండాలి. యూపీఏ హయాంలోనే వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, వృద్ధి రేటు పెరిగాయన్నది గుర్తుంచుకోవాలి’ సూచించారు. అసూయతో ఉన్న వారంతా.. ప్రతీదాన్ని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడతారు. అది మంచైనా కావొచ్చు. చెడైనా కావొచ్చు’ అని చురకలంటించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హయంలో కంటే యూపీఏ హయాంలోనే రికార్డు స్థాయిలో వృద్ధి రేటు నమోదైందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం నిలదొక్కుకుందని.. ఈసారి 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని మన్మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు సాధ్యమైనంత మేలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతేడాది కంటే వ్యవసాయ వృద్ధి రేటును పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విమర్శలు మానుకొని ప్రతిపక్ష నేత, ఇతర సభ్యులు సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. యూపీఏ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీఠ వేసిందని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. యూపీఏ హయాంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. దేశంలో అమలు చేస్తోన్న ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పులేదని అన్నారు. ఆర్థిక సంస్కరణలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై ప్రభుత్వం ఎనలేని పోరాటం చేస్తోందని ప్రధాని తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించే వరకూ పాక్‌తో చర్చలు సాధారణ స్థితికి రావన్నారు. పాక్ పట్ల తొమ్మిదేళ్లుగా అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని, భవిష్యత్‌లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తామన్నారు. శ్రీలంకలో తమిళుల పరిస్థితిపై మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళుల భద్రతకు కృషి చేస్తామని హావిూ ఇచ్చారు. మాల్దీవుల సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.