పేదలకు ఇళ్లపట్టాల కోసం ఆందోళన

విజయనగరం,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): విజయనగరం పట్టణంలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మండల తహశీల్దార్‌ కార్యాలయాన్ని పట్టణ పేదలు ముట్టడించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి పట్టణ పేదల సమస్యల్ని పరిష్కరిం చేంత వరకూ ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. పట్టణంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కరెంట్‌ లేని ప్రాంతాల్లో కరెంట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, హుదూద్‌ వల్ల, రోడ్డు వెడల్పు కారణంగా ఇళ్లుకోల్పోయిన వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ గోవిందరావు కార్యాలయం నుంచి బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని పేదలు నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్‌ గోవిందరావు బయటకు వచ్చి పేదల నుంచి వినతిపత్రం తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకరరావుతో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, పేదలు, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు