పేదల జీవితంలో మార్పు వస్తేనే స్వరాజ్యం

2

– ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ,ఆగస్టు 15(జనంసాక్షి): స్వరాజ్యం నుంచి సురాజ్యం చేయడమే మన లక్ష్యమని, ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటిస్తే సురాజ్యం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న వారందరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవాలని, ఎంతో మంది మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం సిద్ధించడానికి కారణమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగిచారు. భారత దేశానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని, ఇవాళ కొత్త నిర్ణయాలు తీసుకుని, కొత్త సంకల్పంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి నుంచి గాంధీ వరకు, భీముడి నుంచి భీంరావ్‌ అంబేద్కర్‌ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని మోదీ చెప్పారు. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ దేశాన్ని ఒక్కటి చేశారన్నారు. దేశంలో చాలా సమస్యలున్నాయని, అవి అధిగమించడానికి పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాని వరకు తమ కర్తవ్యాన్ని నెరవేర్చితేనే సమస్యలను ఎదుర్కొనే సత్తా మనకు లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నీతి, నియమాలే కాదు నిబద్ధత కూడా ఉండాలన్నారు. పేదల జీవితాల్లో మార్పు వస్తే సురాజ్యం సాధించినట్టేనని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఒక్క నిమిషంలో 15వేల రైల్‌ టికెట్లు ఇచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామని, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మోదీ అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మోడీ ప్రసంగించారు. మహనీయుల త్యాగఫలం వల్లే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు సంకల్పించుకుందామని పిలుపునిచ్చారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం వెనుక లక్షలాది మహా పురుషుల త్యాగం దాగి ఉందన్నారు. ముక్కలుగా ఉన్న దేశాన్ని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఏకం చేశారని గుర్తు చేశారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, అందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని సూచించారు. సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని చెప్పారు. సురాజ్యం ఏర్పాటుకు మన నిరంతర సంకల్పం కావాలన్నారు. సురాజ్యం కల సాకారం ఇంకా ఆలస్యం

చేయరాదు అని సూచించారు. 70వ ఏటా మనం చేస్తున్న సంకల్పం దేశాన్ని రూపాంతరీకరణ చేయాలని అన్నారు. ప్రగతి గతిని మార్చి అభివృద్ధిని కొత్త బాటలో నడిపించాలని పిలుపునిచ్చారు. సామాన్యుడి జీవనంలో మార్పు తేవడమే సురాజ్యమని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో జనజీవనంలో కొత్త మార్పులు తేవాలన్నారు. ఆరోగ్యం, పౌరసేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత జోడించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసమే అన్నింటా ఆన్‌ లైన్‌ విధానం వచ్చిందని చెప్పారు. పథకాల్లో రాయితీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నాయని గుర్తు చేశారు. గతంలో పాస్‌ పోర్టు తీసుకోవాలంటే నాలుగైదు నెలలు తిరగాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు కాలం మారింది, నాలుగు రోజుల్లోనే పాస్‌ పోర్టు ఇంటికి వస్తుందని వెల్లడించారు. సురాజ్యం అంటే పరిపాలన దక్షత పెరగడమే అని వివరించారు. ఒక కంపెనీ నమోదుకు గతంలో నెలల పాటు తిరగాల్సి వచ్చేదని తెలిపారు. ఇప్పుడు 24 గంటల్లో కంపెనీ నమోదు పూర్తవుతుందని స్పష్టం చేశారు. చట్టంలో మార్పులు రాలేదు, కానీ పని విధానం మెరుగుపడిందన్నారు. ఈ రెండేళ్లలో 70 కోట్ల మంది ప్రజలను ఆధార్‌తో అనుసంధానించామని పేర్కొన్నారు. 21 కోట్ల మందిని జన్‌ ధన్‌ యోజనతో అనుసంధానించామని తెలిపారు. జన్‌ ధన్‌ యోజన అనుసంధానంతో కొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికామని తెలిపారు. కాలం మారింది, ప్రణాళికల్లో లెక్కలు చెబితే జనం సంతృప్తి చెందరు అని పేర్కొన్నారు. కళ్లెదుట జరిగిన పని కనపడినప్పుడే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులే మనకు భవిష్యత్‌ అని సూచించారు. సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో భారీ అభివద్ధి దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తే సరిపోదు, సరఫరానూ మెరుగుపర్చాలని సూచనలు చేశారు. ఈ రెండేళ్లలో 18 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి మూడు గంటల్లో వెళ్లే గ్రామానికి నిన్నటి వరకు విద్యుత్‌ సరఫరా లేదు, అలాంటి ఎన్నో గ్రామాలకు ప్రభుత్వం విద్యుత్‌ సౌకర్యం కల్పించామని చెప్పారు. రూ. 350 విలువైన ఎల్‌ఈడీ బల్బును రూ. 50కు అందించేలా కృషి చేశామని తెలిపారు. విద్యుత్‌ ఆదా కోసం ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్సులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఎల్‌ఈడీ బల్బులతో  లక్షా 25 వేల కోట్ల మేర విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. ఖతార్‌తో గ్యాస్‌ సరఫరా ఒప్పందాన్ని పునఃసవిూక్షించడంతో రూ. 20 వేల కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇరాన్‌ లోని చాబహార్‌ నౌకాశ్రయం నిర్మాణం భారత ఇంధన రంగంలో కొత్త శకానికి నాంది పలికిందని చెప్పారు. 60 ఏళ్లలో 14 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తే, తాము 60 వారల్లో 4 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం సాగు, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఉద్ఘాటించారు. ప్రతి నీటి చుక్క కూడా వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులకు సాగు నీరందిస్తే భూమిలో నుంచి బంగారం పండిస్తారని పేర్కొన్నారు. అంతటి శక్తి భారతీయ రైతులకు ఉందని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో ద్రవ్యోల్బణం 10 శాతం దాటితే తాము 6 శాతానికి మించకుండా చూశామన్నారు. ద్రవ్యోల్బణం 4 నుంచి 2 శాతానికి తగ్గించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పప్పు ధాన్యాల ఉత్పాదకత తగ్గినా.. ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. రిఫార్మ్‌, పెర్‌ ఫార్మ్‌, ట్రాన్స్‌ ఫార్మ్‌ మంత్రాక్షరాలతో దేశం ముందుకు సాగుతుందన్నారు. అసంపూర్తిగా ఉన్న 18 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తున్నామని

తెలిపారు. చాలా ప్రాజెక్టులకు పునాది వేసి వదిలేశారు, రూ. వేల కోట్లు వృథా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి రూపాయి సద్వినియోగం చేసేందుకే ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది అట్టడగు వర్గాల వారికి చేరాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఉద్ఘాటించారు. స్వల్ప కాలంలో 70 వేల గ్రామాల్లో 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించగలిగామని చెప్పారు. భారతదేశానికి వేలాది ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. భారత్‌ సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. దేశం ముందు అనేక సవాళ్లున్నాయి, వాటిని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడం ప్రారంభిస్తే సమయం సరిపోదన్నారు.