పేదోళ్లకు స్థలాలివ్వండి మహాప్రభో

గళమెత్తిన వామపక్షాలు సమస్యల విజ్ఞప్తికి యత్నిస్తే.. : నున్న
ఖమ్మం, ఆగస్టు 10 : పట్టాలు ఇచ్చారు.. స్థలాలు మరిచారు.. వెంటనే స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు గళమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన అతిథి గృహంలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. స్థలాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శుక్రవారం ఉదయం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్దకు భారీ సంఖ్యలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. సిఎం డౌన్‌ డౌన్‌, సమస్యలు పరిష్కరించాలి, పేదలకు స్థలాలు ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించేంతవరకు సిఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేగాక లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
పేదల స్థలాల కోసం.. : నున్న
నేటికీ పేదలకు స్థలాలు ఇవ్వకపోగా.. నిలదీసినందుకు తమను అరెస్టు చేస్తున్నారని సిపిఎం నేత నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇదేమిటి అన్న పాపానికి అరెస్టు చేయడం తగదన్నారు. పట్టాలు ఇచ్చారు.. స్థలాలు నేటికీ ఇవ్వలేదు. పేదలు ఇబ్బందులు పడుతున్నారు. స్థలాలు ఇవ్వాలని పేదలు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విషయాన్ని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరేం దుకు తరలి వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేయడం అమానుషమన్నారు. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నా యన్నారు. వాటినన్నింటిని పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడమే గాని ఆచరణలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతా మని హెచ్చ రించారు.