పేద బిడ్డకు దక్కిన ఎం బి బి ఎస్ సీటు దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు ఆర్థిక సహాయాన్ని ఆర్తిస్తున్న కుటుంబం

మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచినీళ్ల లస్మయ్య గౌరమ్మ కూతురు భాగ్యలక్ష్మి ఇటీవల నిర్వహించిన నీట్ జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించింది. కానీ కూలి నాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే లస్మయ్య తన బిడ్డను ఉన్నత చదువులు చదివించడానికి తన వద్ద ఆర్థిక స్తోమత లేక విలవిల్లాడుతున్నాడు. పేద వర్గానికి చెందిన మంచినీళ్ళ లస్మయ్య తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాడు. స్వగ్రామమైన అన్నారంలో నాలుగో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో , తర్వాత ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదివింది. ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం విద్యను వంగర గురుకుల విద్యాలయ సంస్థలో చదివి అత్యున్నతమైన ర్యాంకులో నీట్ లో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం హైదరాబాద్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో చదివి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తో ఎంబీబీఎస్ అర్హత సాధించింది. ఎంబిబిఎస్ రాష్ట్రస్థాయిలో జనరల్ కేటగిరీ కింద 4804 ర్యాంకు సాధించగా , ఎస్సీ కేటగిరిలో 359 ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తన బిడ్డను ఎంబిబిఎస్ చదివించాలి అనే పట్టుదల తండ్రిలో ఉన్నా.. కడు పేదరికం వెంటాడడం వల్ల అక్షర సరస్వతిగా పేరు ఉన్న భాగ్యలక్ష్మి వైద్య విద్యకు నోచుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి కౌన్సిలింగ్ లోనే మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల జి ఎం హెచ్ బి లో ఎంబీబీఎస్ సీటుకు అర్హత పొందింది. వైద్య విద్యను పూర్తి చేయడానికి ఏడాది కి లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది . మారుమూల అటవీ ప్రాంతంలో దళిత బిడ్డ అరుదైన ఎంబీబీఎస్ సాధించిన మొట్టమొదటి విద్యార్థిగా భాగ్యలక్ష్మి నిలిచింది. కానీ తాను కూలి పని చేసుకుంటూ అంత డబ్బును వెచ్చించలేనని, ఆపన్న హస్తం కోసం నిస్సహాయ స్థితిలో మంచినీళ్ల లస్మయ్య గౌరమ్మ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవతామూర్తులు స్పందించి సరస్వతీ కటాక్షం కలిగిన భాగ్యలక్ష్మిని వైద్య విద్య పూర్తి చేసేందుకు నగదు రూపేనా సహాయం అందించి ఆదుకోవాలని మంచినీళ్ల లస్మయ్య అర్తిస్తున్నారు. 9848 31 98 63 నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా .ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటారని ఆశీస్తున్నారు