పొంగులేటి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు

– ఆయనతో నేను స్వయంగా మాట్లాడా
– బుధవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారు
– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలనసాగుతుంది
– కేసీఆర్‌ పాలన నచ్చే తెరాసలో చేరా
– ఖమ్మం పార్లమెంట్‌లో గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తా
– ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
ఖమ్మం, మార్చి26(జ‌నంసాక్షి) : తెరాస సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని, పొంగులేటికి నేను ఫోన్‌ చేశానని, బుధవారం నుంచి తనతో పాటు ప్రచారంలో పాల్గొంటానని చెప్పారని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విూట్‌ది ప్రెస్‌లో నామా పాల్గొని మాట్లాడారు.. ఖమ్మం జిల్లా అన్ని విధాల అబివృద్ధి కావాలన్నదే నా ఉద్దేశమన్నారు. రాజకీయాలకు రాక మునుపే ట్రస్ట్‌ ద్వారా సేవలు చేశానని, మరింత సేవ ప్రజలకు చేయాలని రాజకీయాలు లోకి వచ్చానని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం కోసం 2014లో.. కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేసి నప్పుడు, చావు బ్రతుకల మధ్య ఉన్నారని,  ఆ సమయంలో పార్లమెంట్‌లో చర్చ జరగాలని పట్టు బట్టి చర్చ చేశామన్నారు. చర్చ అనంతరం అన్ని పార్టీలు ప్రభుత్వానికి చెప్పిన దానిలో కీలక పాత్ర వహించానన్నారు. 17 ఫిబ్రవరి 2014లో రావాల్సిన బిల్లు 18న వచ్చిందని, బిల్లు.. పాస్‌ కావడానికి ప్రముఖ పాత్ర లోకసభ లో వహించానన్నారు. 19 న ఆమోదం వచ్చి 20న రాజ్యసభ ముందుకు వచ్చిందన్నారు. బాబ్లీ పోరాటం లోను పోలీసులతో తన్నులు తిన్నది,  బయ్యారం గనులు 1.50 లక్షల ఎకరాలు ప్రైవేట్‌కు ధారాదత్తం చెయ్యడానికి సిద్ధపడితే.. జిల్లాకు, తెలంగాణాకు అన్యాయం జరుగ వద్దని ఆ ఆదేశాలు రద్దు చేయించానన్నారు. తెలంగాణ వస్తే కరంటు ఉండదన్నారని, నేడు 24గంటలు కరంటు వస్తోందని నామా అన్నారు. ఆనాడు కరంటు కోసం ధర్నాచేసిన వాడిలో నేను ప్రథమంలో ఉన్నానని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్‌ అద్భుత పాలన సాగించారని అన్నారు. ముఖ్యంగా రైతులకు, పేద వర్గాల ప్రజలకు అండగా ఉంటూ కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, ప్రజలు ఆకాంక్షలు కు అనుగుణగంగా కేసీఆర్‌ పాలన సాగుతోందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే అద్భుత పథకాలను కేసీఆర్‌ అమలు చేస్తున్నారని నామా పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో 18వేలకోట్ల సీతారామ ప్రాజెక్టుకు నాలుగు నెలల్లో అనుమతులు తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఐదేళ్లలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్‌ సాగిస్తున్న పాలనకు ఆకర్షితుడినై.. తాను తెరాసలో చేరానని నామా తెలిపారు. తాను పార్టీలో చేరిన వెంటనే సముచిత స్థానం కల్పించి ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలోని తెరాస నేతలందరిని కలుపుకొని పోతూ ఖమ్మం పార్లమెంట్‌పై తెరాస జెండా ఎగురవేస్తామని, తద్వారా కేసీఆర్‌కు గెలుపు కానుకను అందిస్తానని నామా స్పష్టం చేశారు.