పొన్నాల వచ్చినా ఓటమి ఖాయం
ఓటమి భయంతోనే పొత్తులు: ముత్తిరెడ్డి
జనగామ,నవంబర్12(జనంసాక్షి): మహాకూటమి నుంచి ఎవరు పోటీ చేసినా ఓటమి కావాల్సిందేనని జనగామ టిఆర్ఎస్ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి అన్నారు. పొన్నాల లక్ష్మయ్య అయినా మరోమారు ఓడిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ఆయనను ఓడించామని, మరోమారు వస్తే ఓడిస్తామని అన్నారు. గ్రామాల్లో వలసల నివారణకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పునరుజ్జీవం పోసిందని అన్నారు. చేనేత, గీత కార్మికులకు బ్జడెట్లో అధిక నిధులు కేటాయించడం, వారి వృత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ఇవ్వడంతో వృత్తులు మళ్లీ జీవం పోసుకున్నాయన్నారు. రూ. 30 కోట్లతో ఆర్టీసీ చౌరస్తా సుందరీకరణ పనులు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనగామ టీఆర్ఎస్కు విజయం ఆదరించాలని కోరారు. రానున్నది మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హావిూ ఇచ్చారు. మరోసారి అవకాశమిస్తే వచ్చే ఐదేళ్లలో పట్టణంతోపాటు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చుదిద్దుతానని చెప్పారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే హస్తం పార్టీ కారు దెబ్బకు మహా కూటమి ఏర్పాటు చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్
పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారని, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందజేస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ 15 ఏళ్లు, కాంగ్రెస్ 45 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయాలేని అభివృద్ధిని, సంక్షేమపథకాలను సీఎం కేసీఆర్ నాలుగేండ్లలోనే చేసి చూపారన్నారు. 400 రకాల సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులను రాజును చేయడానికి రైతు బంధు, రైతుబీమా పథకాలు,
ఉచితంగా24 గంటల కరంటు అందిస్తున్నారని తెలిపారు.