పొలంలోనే రైతుకు చెక్కు అందించిన ఎంపి
రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ అన్న నగేశ్
ఆదిలాబాద్,మే16(జనం సాక్షి):ఆదిలాబాద్‌లోని ముఖ్ర కే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు ఎంపీ నగేశ్ పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ రైతుకు చెందిన పొలం వద్దకు స్వయంగా వెళ్లిన ఎంపీ నగేశ్ పంట పొలంలోనే రైతుకు చెక్కు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రెసిడెంట్ గాడ్గె సుభాష్, ఏంసీ ఛైర్మన్ ఆడె షెల్లా , జెడ్పీటీసీ కుమార్, ఎమ్మార్వో, వీర్వోలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వేసే ప్రతీ అడుగు రైతు సంక్షేమం కోసమేనని ఈ సందర్భంగా ఎంపి నగేశ్ అన్నారు. ప్రపంచ దేశాలు సైతం సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం వైపు ఆసక్తికరంగా చూస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులంతా సీఎం కేసీఆర్ గురించి
చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్నది జిమ్మిక్కేనని విపక్షాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సైతం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, రైతుబంధు పథకం చాలా బాగుందని మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించిన సీఎం కేసీఆర్ చరిత్రలో రైతు బాంధవుడిగా నిలవనున్నారని అన్నారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రభుత్వం పై విపక్షాలు బురదచల్లడం అవివేకం అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎం కేసీఆర్ పాలన వస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రైతులు తొందరపడకుండా క్యూలైన్ ఉండి చెక్కులు తీసుకోవాలని సూచించారు.