పోటెత్తిన ఉబ్బస రోగులు

కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ చేస్తున్న ప్రసాదం కోసం ఉబ్బస రోగులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం బత్తిన హరిప్రసాద్‌గౌడ్‌ శనివారం మధ్యాహ్నం చేపమందు పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. సుమారు 2 లక్షల మంది వరకూ రావొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. వచ్చిన వారందరికీ ప్రసాదం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రసాదం పంపిణీకి అనుమతించిన హైకోర్టుకు, సహకరిస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చేప ప్రసాదం అశాస్త్రీయమని, దాని పంపిణీకి ప్రభుత్వం సహకరించొద్దని లోకాయుక్త ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందా? లేదా? అన్న ఉత్కంఠ మొదలైంది. అయితే, బత్తిని సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, చేప ప్రసాదం పంపిణీకి కోర్టు అనుమతించడంతో ఉత్కంఠకు తెరపడింది. చేప ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో ఆస్తమా బాధితులు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి కూడా రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. చేపప్రసాదం పంపిణీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం సమయంలో నగరానికి ఇవి చేరడంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 32 కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేశారు. తొలి రోజు కోసం 50 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించారు. సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు 600 మందిని ఇక్కడ నియమించారు. 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారం, నీటి సరఫరా చేశాయి.