పోడు సమస్యలను పరిష్కరించాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగుభూములన్నిటికి పట్టాలివ్వాలని న్యూ డెమక్రసీ నేతలు కోరారు. అభివృద్ధి పేరిట పోలవరం ప్రాజక్టులు, సింగరేణి ఒపెన్‌కాస్ట్‌ గనుల త్రవ్వకం వల్లనే అడువులు ప్రధానంగా ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. పోడు సమస్యలపై ఐటీడీఏ ముట్టడి, ధర్నాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.అటవీశాఖ అధికారులు జరిపే దాడులు, దౌర్జన్యాలు ఆపాలని పేర్కొన్నారు. అడవుల నాశనానికి పోడు వ్యవసాయం ప్రధాన కారణం కాదని, కొంతమంది అవినీతి అధికారుల వలన కూడా అడవుల నాశనమవుతున్నాయన్నారు. గిరిజనులు, పేద గిరినేతరులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాల్వివాలని డిమాండ్‌ చేశారు. అధికారులు హరితహారం పేరుతో సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటడం సరైంది కాదన్నారు. హరితహారం పేరుతో కందకాలు తువ్వడం, మొక్కలు నాటడం మానుకోవాలన్నారు. పోడు సాగుదారులపై అక్రమంగా అటవీ, పోలీసు అధికారులు కేసులు పెట్టడం మానుకోవాలన్నారు.