పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ
నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) :
పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ స్నాతకోత్సవంలోనూ జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిస్తున్న పోరాటానికి దశ దిశగా ఉన్న ఓయూ ప్రతి నిత్యం ప్రత్యేక వాదాన్ని ఎలుగెత్తి చాటుతూనే ఉంది. వర్సిటీలో విద్యార్థులకే పండుగ రోజైన స్నాతకోత్సవాన్ని వారు పోరాట వేదికగానే మార్చుకున్నారు. తెలంగాణ కావాలంటూ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే మేం పండుగ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. సభ నిర్వహిస్తుండగానే దిక్కులు పిక్కటిల్లేలా రణనినాదాలు చేశారు. వర్సిటీ స్నాతకో త్సవానికి చాన్స్‌లర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర్సింహన్‌ హాజరవుతారని ప్రకటించడంతో పీడీఎస్‌యూ యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఉస్మానియాలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, తెలంగాణకు వ్యతిరేకిగా ముద్రపడిన మీరు హాజరైతే పరిస్థితులు చేతులు దాటుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో చివరి నిమిషంలో గవర్నర్‌ తన పర్యటనను ఉపసంహరించుకోవాలి. ఉస్మానియాకు వెళ్తే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదంటూ నిఘావర్గాలు హెచ్చరించాయి. విద్యార్థి సంఘాలు ఘాటుగా హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్‌ ఉస్మానియా పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం జాతీయ పరిశోధకులు, జూబ్లియంట్‌ భారతీయ చైర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా పరిశోధనలు పూర్తి చేసినవారికి, పోస్టు గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ క్రమంలో పాండురంగారెడ్డి అనే రీసెర్చ్‌ స్కాలర్‌ తెలంగాణ వచ్చే వరకూ తన డాక్టర్‌ను స్వీకరించబోనని వేదికపైనుంచి ప్రకటించారు. ఆయనకు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు. పీహెచ్‌డీ పొందిన వారంతా వేదికపై నుంచి జై తెలంగాణ అని నినదించారు.