పోరాడిన యోధుడికే పట్టాభిషేకం
` తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి
` రేపు ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం
` ఉత్కంఠ నడుమ ఢల్లీి నుంచి ప్రకటన
` సీఎల్పీ నేతగా ఖరారు చేసిన హైకమాండ్
` అధిష్టానం పిలుపుతో హస్తినాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి
అందరూ అనుకున్న నాయకుడినే అధిష్టానం ఎన్నుకుంది. ప్రజామోదం పొందిన ప్రజాప్రతినిధికే తెలంగాణ పగ్గాలు అప్పగించింది. పంతాలు పట్టింపులకు ఏమాత్రం తావివ్వకుండా పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించి.. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్న నాయకుడికే ప్రాధాన్యత కల్పించింది. ఎలాంటి శషబిషలూ లేకుండా సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రేపు ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నామని ప్రకటించిన కేసీ వేణుగోపాల్.. రేవంత్ ఓ డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని, పార్టీ గెలుపునకు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. అధిష్టానానికి అందిన నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
న్యూఢల్లీి/హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి)
మంగళవారం ఢల్లీిలో ఏర్పాటు చేసిన మీడియాంలో మాణిక్ ఠాక్రే , డికె శివకుమార్ పాల్గొన్నారు. మంతరివర్గ కూర్పు తదితర విషయాలను రేపు ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢల్లీికి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి సీఎం పదవీపై స్పష్టమైన హావిూ రావడంతోనే రేవంత్ ఢల్లీి బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢల్లీి వెళ్లిన విషయం తెలిసిందే. రేవంత్ ఢల్లీి వెళ్లడంతో మంత్రివర్గ ఊహగానాలకు తెరపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సిఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ కరసత్తు చేసింది. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం వద్దకు చేరడంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో నిన్న భేటీ జరిగింది. ఇందులో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మురళీధరన్ ఈ భేటీలో పాల్గొనగా.. మెజారిటీ సభ్యులు రేవంత్‌వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. సీఎల్పీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా సీఎంతో పాటు మంత్రివర్గ కూర్పుల విషయంలోనూ చర్చ జరిగినట్టు తెలిసింది.
ఢల్లీిలో లాబీయింగ్..?
సీఎం పదవి, కేబినెట్ బెర్తుల విషయంలో పంచాయితీ ఢల్లీి చేరిన విషయం విదితమే. ముఖ్య నేతలు పట్టువీడకపోవడంతో డీకే శివకుమార్‌తో పాటు పరిశీలకులను అధిష్ఠానం ఢల్లీికి పిలిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం ఢల్లీిలో మకాం వేశారు. ఎవరికి వారు తమ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం కూడా పలువురు నేతలు ఢల్లీిలో అప్పుడే లాబీయింగ్ మొదలు పెట్టారు. తాజాగా మరో నేత సైతం ఢల్లీిలో ప్రత్యక్షమయ్యారు. బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీ వినోద్ ఢల్లీిలో మకాం వేసారు. ప్రస్తుతం అన్నాదమ్ముళ్లు ఇద్దరు మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికి మాత్రమే పదవి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వినోద్ ఢల్లీిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. తాను గతంలో మంత్రిగా పని చేశానని.. తనకు మరోసారి కేబినెట్‌లో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు వివేక్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండి మంతనాలు చేస్తున్నారు.
నాకు అన్ని అర్హతలున్నాయ్ : ఉత్తమ్
కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోద యోగ్యమేనని భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు తెలిపారు. తన అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ అన్ని ఆలోచనలు చేస్తుందని, నలుగురు.. ఐదుగురు రేసులో ఉండటం తప్పుకాదని ఉత్తమ్ అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని ఉత్తమ్ తెలిపారు.
‘కొత్త’ ఆశల్లో ఉమ్మడి పాలమూరు
అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగిన రేవంత్ రెడ్డి అనతికాలంలోనే సిఎం కాబోతున్నారు. తక్కువ కాలంలో రాజకీయంగా అనూహ్యంగా దూసుకుని వచ్చి..తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుముల రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. తొలుత 2002లో తెరాసలో చేరారు. ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిరచారు. ఆ తర్వాత 2008లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో భారాసకు వ్యతిరేకంగా పోరాడారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ.. 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్.. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలతో నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభలో పాల్గొన్నారు. తన కొడంగల్ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఈక్రమంలో తనకు తిరుగులేదన్న ధీమాలో ఉన్న కెసిఆర్‌ను మట్టి కరిపించారు. రాజకీయ ఎత్తులతో చిత్తు చేశారు.
(అధికారులూ.. బీ అలర్ట్ : రేవంత్ రెడ్డి
తెలంగాణకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి తన మార్క్ చూపించారు. మిగ్‌జాం తుఫాను ప్రభావం, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. వరిధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
(తోడున్న అందరికీ రుణపడి ఉంటా : రేవంత్ రెడ్డి
నూతన సీఎల్పీ నాయకుడిగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్ధతుగా నిలిచిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. అనునిత్యం వెన్నంటి ఉండి సహకరించిన పార్టీ సైనికులకు రుణపడి ఉంటానని తన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇలా..
1969 నవంబరు 8న జన్మదినం
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం
2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి స్వతంత్ర సభ్యుడిగా విజయం
2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్రంగా ఎన్నిక
2009లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు
2014లో రెండోసారి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
2014?17 మధ్య టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్
2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా
2017 అక్టోబరులో కాంగ్రెస్ పార్టీలో చేరిక
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం
2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి
2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్
2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు