పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది

– 12, 13 తేదీల్లో గడ్కరీ ఏపీ పర్యటన
– బీజేపీ ఎంపీ హరిబాబు
విజయవాడ, జులై10(జ‌నం సాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు.  ఆయన విశాఖలో విూడియాతో మాట్లాడుతూ… ఈనెల 12న పోలవరం ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించనున్నారని అన్నారు. 12న  సాయంత్రం గడ్కరీ విశాఖ సాయిప్రియా రిసార్ట్‌ లో బీజేపీ నేతలకు పోలవరం ప్రగతి గురించి వివరిస్తారని, తమ శాఖల నుంచి ఏపీకి అందుతున్న వివిధ పధకాలు కూడా వివరిస్తారని తెలిపారు. 12, 13 తేదీల్లో గడ్కరీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని సవిూక్షలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ఏపీలో లక్ష కోట్ల విలువైన రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు హరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 13న విశాఖలో రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు గడ్కరీ శంకుస్థాపన చేస్తారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో పౌర విమానాల రాకపోకలపై నావికాదళం ఆంక్షలను సడలించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని హరిబాబు పేర్కొన్నారు. పేరలల్‌ టాక్సీ పేరిట వేరే రన్‌ వే నిర్మాణానికి పోర్టు స్థలం 35 ఎకరాలు సేకరించటానికి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడుతామని తెలిపారు. విజయనగరం జిల్లా బాడంగి ఏర్‌ స్టిప్ర్‌ పునరుద్ధరణకు కూడా నేవీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.