పోలవరం నిర్వాసితులకు దక్కని భరోసా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రాజెక్ట్ పనులపై నీడ
అవినతిపై పరస్పర విమర్శలతో పనులకు అడ్డంకి
అమరావతి,జూన్28(జనం సాక్షి): 2019నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పూర్తిగా బేఖాతరు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. పోలవరం కారణంగా 271 గ్రామాలకు చెందిన 45 వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వీరిలో అత్యధికులు గిరిజనులే. మొత్తం ఖర్చులో దాదాపుగా రూ. 21 వేల కోట్లు పునరావాస పనులకే ఖర్చువుతాయని భావిస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని, అందుకే తాము ప్రాజెక్టు బాధ్యతను తీసుకున్నామని ఆనాడు చంద్రబాబు ప్రకటించారు. ప్రతి సోమవారం ‘పోలవారం’ అన్నా సమస్యలు తీరడం లేదన్నారు. మరోపక్క పునరావాసం బాధ్యత కేంద్రానిదేనంటున్నారు. ‘ముందు పునరావాసం, తర్వాతే ప్రాజెక్టు’ అని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రం చేసిన ఖర్చునుగానీ, పునరావాసానికయ్యే మొత్తాన్నిగానీ చెల్లించడానికి కేంద్రం ససేమిరా అన్న తరువాతే ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. అంతకు ముందు దీనిని ఎందుకు ప్రస్తావించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే పోలవరం విషయంలో రాష్ట్రం వనరుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ఏం కానుందన్న ఆందోళన ప్రజలందరిలో కలుగుతోంది. మరోవైపు ఇవ్వవలసిన నిధులన్నీ ఇచ్చేశామని బిజెపి ప్రభుతం ప్రకటిస్తోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పోలవరంపై వాస్తవాలను ప్రజలందరికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివాదాస్పదంగా మారుస్తున్న తీరు ప్రతికూల సంకేతాలనిస్తోంది. ఈ అంశాన్ని రెండు ప్రభుత్వాలు వివాదాస్పదం చేస్తున్న తీరు కారనంగా ఇది ఎప్పటికి పూర్తవుతుందో అన్న ఆందోళన ప్రజల్లో ఉంది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వంత పాడినంత కాలం నిధులు, విధులు, నిబంధనల గురించి చంద్రబాబు పెద్దగా పెదవి విప్పనేలేదు. బాబు ఎన్‌డిఎ నుంచి వైదొలిగాకనే ప్రాజెక్టు పనుల్లో చోటు చేసుకుంటున్న నిధుల దుర్వినియోగంపైన, నిబంధనల బేఖాతరు పైనా కమలనాథులు గొంతు చించుకోవడం మొదలెట్టారు. పరస్పర వ్యూహ ప్రతివ్యూహాలుగా విమర్శలు ఉన్నాయి. కేవలం సాగునీటి ప్రయోజనాల కోసమే పోలవరాన్ని ఉద్దేశించలేదు. జల విద్యుత్ ఉత్పత్తి కూడా దీని లక్ష్యం! జల విద్యుత్ కేంద్రానికి నిధులిచ్చేది లేదంటూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డం తిరిగింది. అనుభవంలో తనను మించిన వారు లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని తేల్చుకోకుండానే ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రం నెత్తిన ఎత్తుకోవడానికి తొందరెందుకుపడ్డారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తానికి కూడా కేంద్రం నుండి నిధులు విడుదల కావడం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆవేదన. తాజాగా చర్చకు వచ్చిన 1935 కోట్ల రూపాయల మొత్తానికి సంబంధించిన వివరాలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుండి తమకు అందలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో విధులు నిర్వహించే ఆ సంస్థ నుండి వివరాలు తీసుకునే బాధ్యత కేంద్ర పెద్దలకు లేదా? జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను ఏకపక్షంగా,హడావిడిగా తామే చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది? అఖిలపక్షంతోగానీ, శాసనసభలో గానీ ఎందుకు చర్చించలేదన్న విషయాలను రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నాయి. మొత్తంగా దీనిని అడ్డంకులు లేకుండ ఆపూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.