పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు

fsgbtuqx

హైదరాబాద్ :  ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బుధవారం గోషామహాల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీసు అమరవీరులకు  కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ…  పోలీస్ అమరవీరులకు సమాజం రుణపడి ఉంటుందని, శాంతిభద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.  సమాజ రక్షణ కోసం పాటుపడుతున్న పోలీసుల త్యాగాలను సమాజంలో అందరూ గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులకు స్థానం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

 కేసీఆర్ ఈ సందర్భంగా పోలీసులపై వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహకాలు… ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారులకు విధులు నిర్వహిస్తున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వారికి ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ఎస్ఐ ఆ పైస్థాయి అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు కేటాయిస్తామన్నారు.

అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 35 శాతం అలవెన్స్ను ప్రకటించారు. అలాగే పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్స్ రూ. 3, 500 నుంచి రూ. 7,000 వరకు పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.