పోలీసులు అతిగా వ్యవహరించడం తగదు


ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి,ఆగస్ట్‌18(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణం అని టిడిపి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలీసులు అధికారానికి తలొగ్గటం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో దళితులు, బీసీలు, మైనార్టీలు, కాపులతోపాటు అన్నివర్గాల ప్రజలపై వైసీపీ సాగిస్తున్న దమనకాండకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో విర్రవీగితే తగిన గుణపాఠం జరిగి తీరుతుందన్నారు. అక్రమాలకు తెరతీస్తూ అందినకాడికి దోచుకొని
ఆదాయ వనరులన్నింటినీ నాశనం చేసే వైసీపీ ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ క్షమించరన్నారు.
దళిత నేత నక్కా ఆనందబాబుపై ఇష్టానుసారంగా వ్యవహరించటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, సోషల్‌ విూడియాలో పోస్టులు పెట్టడం, ప్రదర్శన, నిరసన తెలిపే హక్కులు ఎవరికీ లేదన్న రీతిలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహనరెడ్డి, వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ నడిరోడ్డుపై ఉరితీయండి, కాల్చి చంపండని మాట్లాడిన వారిపై ఎన్ని కేసులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు.