పోలీసుల సేవలు అనిర్వచనీయం

ఏపీ పోలీసులే దేశంలోనే ‘ఆదర్శం’
పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో సీఎం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి):
పోలీసుల సేవలను మరువబోమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోషామహల్‌ స్టేడియంలోని పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు. తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ పోలీసుల సేవలను జాతి ఎన్నడూ మరవబోదని చెప్పారు. దేశ వ్యాప్తంగా 566 మంది.. రాష్ట్రంలో 10 మంది పోలీసులు విధి నిర్వహణలో ఆశువులు బాశారని ఆవేదనగా అన్నారు. ఉగ్రవాదుల అణచివేతలో పోలీసులు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చుకో తగ్గవిగా ఉన్నాయన్నారు. పోలీసులు సేవలు అనిర్వచనీయమన్నారు. శాంతిభద్రతలను కాపాడ డంలోను, పరిరక్షించడంలోను రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. పోలీసులపై పని ఒత్తిడిని తగ్గించేందుకుగాను పోలీసు రిక్రూట్‌మెంటును వేగవంతం చేశామని తెలిపారు. పోలీసుల కుటుంబాలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం ఎంతో విలువైనదని, ఎంతో ఉన్నతమైనదని కీర్తించారు. విధి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచారన్నారు. ఈ ఘనత పోలీసులకే దక్కుతుందన్నారు. మొక్కవోని ధైర్యంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రభుత్వం చేదోడుగా ఉంటుందన్నారు. పోలీసు ఉద్యోగుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాటున ఏ ఒక్కరు తప్పు చేసినా.. అది పోలీసు వ్యవస్థ మొత్తానికి చుట్టుకుంటుందన్న విషయాన్ని గమనంలో పెట్టుకుని మసలుకోవాలని పోలీసులకు హితవు చెప్పారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన వాటిని ఆ కుటుంబీకులకు అందజేస్తామన్నారు. అలాగే పోలీసులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రి కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అంతేగాక పోలీసుల క్వార్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు, మరమ్మతులకుగాను మరో 35 కోట్ల రూపాయలను విడుదల చేశామని తెలిపారు. అనంతరం డీజీపీ దినేష్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం సబ్సిడీలతో కూడిన క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆర్మీ క్యాంటిన్‌ వలె అన్ని వస్తువులు అందులో లభ్యమయ్యే విధంగా చూడాలని కూడా కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్న పోలీసు క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర హోంశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.