పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల కోసం న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 21 (జనంసాక్షి) :
పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులో న్యూట్రిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శనివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న న్యూట్రిషన్ కేంద్రాన్ని, డయాలసిస్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆధునాతన వైద్య చికిత్సల నిర్వహణకు ఆసుపత్రికి మంజూరు చేసిన పరికరాలను తక్షణం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. దీనికై సంబంధిత ఆసుపత్రుల సమన్వయ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలు గుర్తించి, చిన్నారులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఈ విధంగా కృషి చేయాలని అని అన్నారు. నిరంతర వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా న్యూట్రీషన్ కేంద్రాలు పనిచేయాలని వివరించారు. ఆసుపత్రిలో శిశువుతో పాటు తల్లి కూడా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకంగా వంట గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. న్యూట్రిషన్ కేంద్రంలో పౌష్టికాహారానికి సంబంధించిన చార్టులు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. చిన్నారులకు కేటాయించిన వార్డులను రంగులు వేసి అందంగా ముస్తాబు చేయాలని, జిల్లాలో భద్రాచలంతో పాటు మరో న్యూట్రిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులు పౌష్టికాహారలోపంతో జన్మిస్తున్నారని గమనించి ప్రత్యేకంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి నందు న్యూట్రిషన్ వార్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో చిన్నారులకు అవసరమైన పోషకాలను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అందించడం జరుగుతుందని, తద్వారా వారిని వ్యాధి బారి నుండి కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున అత్యవసర వైద్య సేవలు నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. డయాలసిస్ వార్డును సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఆపరేషన్ థియేటర్ మరమ్మత్తులకు గురైనందున మార్చుటకు అనుమతి, నిధులు మంజూరు చేయాలని కోరగా, అందుకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఆదివాసి గిరిజన గ్రామాలు అధికంగా ఈ ప్రాంతంలో భద్రాచలం ఆసుపత్రికి వైద్య సేవలు కొరకు అనునిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని ప్రజలకు ఈ నేపథ్యంలో వచ్చినవారికి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. దీనికి ముందు భద్రాచలం పట్టణంలో జరుగుతున్న డివైడర్ నిర్మాణ, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వీధి లైట్లు ఏర్పాటుకు అదనంగా 10 విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఎస్ఈడి లైట్లు, స్ట్రిప్పులు ఏర్పాటు చేయాలని, డివైడర్ ల మధ్యలో అందమైన రకరకాల మొక్కలు నాటాలని అన్నారు. భద్రాచలం సుందర పట్టణంగా తీర్చిదిద్దేలా తయారు చేయాలని కోరారు. మురుగునీరు నిల్వలు లేకుండా నిరంతరం పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణాన్ని సుందరంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. తదుపరి శిశుగృహా కేంద్రాన్ని పరిశీలించి పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా తయారు చేయడంతో పాటు మొక్కలు నాటాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ శిశు గృహాంలో తల్లితండ్రులు వదిలి వేయబడిన చిన్నారులను, అనాధలను అక్కున చేర్చుకుని ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు దత్తత తీసుకునేందుకు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అత్యంత పకడ్బందీగా దత్తత ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిశు గృహాంలో అన్ని ఏర్పాట్లును రెండు రోజుల్లో పూర్తి చేసి సుందరంగా తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, సుజాత, భద్రాచలం ఆసుపత్రి పర్యవేక్షకులు, తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, డిసిపిఓ హరికుమారి, ఐసిడిఎస్ సూపర్వైజర్ హసీనాబేగం తదితరులు పాల్గొన్నారు.