పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యం
పిల్లలతో వచ్చే తల్లులకు వంద నజరానా
నిర్మల్,జూలై13(జనం సాక్షి): ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న గిరిజన పిల్లలకు పౌష్ఠికాహార కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారికుమ్ర బాలు అన్నారు. ఇదే విషయమై ఇటీవల వైద్యులతో సవిూక్షా సమావేశం నిర్విహంచి వారికి సూచనలు చేశామని అన్నారు. పౌష్ఠికాహార లోపం ఉన్న గిరిజన పిల్లలను గుర్తించాలన్నారు. పౌష్ఠికాహార లోపంతో వచ్చిన పిల్లలతో పాటు తల్లికి ఉచితంగా భోజనంతో పాటు రోజుకు వంద రూపాయలు ఇవ్వనున్నట్లు విస్తృత ప్రచారం చేయాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు పేదవారు కావడంతో పాటు వారిలో రోజు కూలి చేసుకొనేవారు అధికంగా ఉంటారని, వారికి ఇలా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏజెన్సీలోని 8 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సూపర్‌వైజర్లు పౌష్ఠికాహార లోపమున్న పిల్లలను గుర్తించి ఐటీడీఏ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా దవాఖా నకు తరలించి చికిత్స అందించాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. వారిని దవాఖానకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. వైద్యశాలకు వచ్చిన రోగి ఒక ఫొటో తీసి మళ్లీ వెళ్లే సమయంలో మరో ఫొటో తీయాలన్నారు. దీంతో వచ్చిన పిల్లల స్థితి అర్థం అవుతుందన్నారు.