ప్యాకేజీలు, పొట్లాలు మాకొద్దు

తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు
టీడీపీ, కాంగ్రెస్‌ అసెంబ్లీలో డ్రామాలాడుతున్నాయి
ఈటెల ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :
ప్యాకేజీలు, పొట్లాలు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ లో మాట్లాడుతూ ప్యాకేజీలు, అభివృద్ధి పేరుతో అడ్డుకోవాలనుకుంటే కాలగ ర్భంలో పార్టీ కలసిపోవడం ఖాయమ న్నా రు. పిచ్చిపిచ్చి డ్రామాలు, నాటకాలు మానుకుని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే ప్రజలు అంగీకరిస్తా రన్నారు. అసెంబ్లీలో కూడా తెలంగాణాపై తీర్మానం పెట్టాలని మళ్లీ, మళ్లీ డిమాండ్‌ చేస్తామని, అడ్డుకుంటామన్నారు. టి టిడిపి, టికాంగ్రెస్‌ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న నేతలు తమతో తీర్మానం కోసం కలిసి రావాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్‌ను ఇప్పటికే పాతరేసేందుకు తరిమి వేసేందుకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో విషమ పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఈటెల హెచ్చరించారు. సభలు, సమావేశాలు తెలంగాణ ప్రజల కడుపు నింపవన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరే కత వస్తుండడంతో టీడీపీలో గుబులు ప్రారంభమైందని దాంతోనే పెడబొబ్బలు పెడుతుందని దుయ్యబట్టారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఓపార్టీని ఇంకో పార్టీ ఎన్నడూ కూడా బొందపెట్టలేరనే కనీస జ్ఞానం లే కుండా ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడు తున్నారని ఆరోపించారు. ప్రజలకు నచ్చన ప్పు డు, వారి అవసరాలను తీర్చలేనప్పు డు ప్రజలే పార్టీలను పాతరేస్తాయనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని ఈటెల హితవు పలికారు. టీడీపీ ప్రజావ్యతిరేక పార్టీ అని తేలిపోయిందన్నారు. తెలంగాణ లో ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి పనికి వస్తాయన్నారు. తెలంగాణ విషయంలో మాట తప్పినందునే టీడీపీని ప్రజలు ఇప్పటికే బొంద పెడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు చేసే సూచనలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన ఏనాడూ పోలేదన్నారు. ఇందిరా పార్క్‌వద్ద వందలాది సంఘాలు, తమ డిమాండ్ల సాధనకోసం పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వానికి కళ్లులేవా అని ప్రశ్నించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఆ పార్టీ తన లక్ష్యాన్ని చేరుకున్నదే అవుతుందన్నారు. 1956లో ఉన్న తెలంగాణ సాధనే తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం తెలంగాణాపై ప్రేమ ఉన్నా తక్షణమే తమతో అసెంబ్లీలో పోరాటానికి కలిసి రావాలన్నారు. ప్రజలను మోసం చేసేందుకే టికాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కృషిచేస్తున్నారని వారి అడుగులు కనిపిస్తున్నాయని ఆరోపించారు.