ప్యాకేజీ వట్టి ముచ్చటే : ముఖేశ్‌

నల్గొండ, జూన్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు పుల్‌స్టాప్‌ పెట్టే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉందనే ప్రచారం వట్టిమాటేనని రాష్ట్ర మంత్రి ముఖేశ్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీలపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు. తెలంగాణపై తాము ఇప్పటికే స్పష్టమైనవిషయాన్ని అధిష్టానానికి వెల్లడిరచామన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరామన్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చే పక్షంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాంతాల, ఇతర జిల్లాల ప్రజలకు రక్షణ కల్పించాలని కోరినట్టు వెల్లడిరచారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, మంత్రి జానారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు మాట్లాడుతూ ప్యాకేజీలు లేకుండా పరిపూర్ణమైన తెలంగాణను ఇవ్వాలని కేంద్రాన్ని తాను కోరుతున్నా నన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అదే విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, మంత్రి జానారెడ్డికి లేఖ రాశానన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రభుత్వానికి మంచి మనస్సు ప్రసాదించమని లక్ష్మీనరసింహుడ్ని వేడుకున్నానన్నారు.