ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే
చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి
కోటి వృక్షార్చనలో స్పీకర్ పోచారం
బాన్సువాడ,ఆగస్ట్26 జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు. ఇటీవలి విపత్తుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు. దేశంలో ప్రతి మనిషికి సగటున కేవలం మూడు చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాతావరణం సమతుల్యత బాగా ఉండాలంటే భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి 2016లో ప్రభుత్వం ’తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశిరచుకోగా దానిని అధిగమించి ఇప్పటి వరకు 270 కోట్ల మొక్కలు నాటారని చెప్పారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అడవుల విస్తీర్ణం 26 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కృషి, హరితహారం కార్యక్రమంతో ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని తెలిపారు. చెట్లు ఉంటే వర్షాలు పడతాయని వెల్లడిరచారు. చెట్లను నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి
బాధ్యతని చెప్పారు. ఒక్కరోజు కోటి మొక్కలు నాటే ’కోటి వృక్షార్చన’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు.