ప్రగతిని విపక్షాలనే అడ్డుకున్నాయి

యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా
మళ్లీ అధికారంలోకి వస్తే ఎనిమిది శాతం వృద్ధి రేటు
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
యూపీఏ నాలుగేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విడుదల
న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) :
దేశ ప్రగతిని విపక్షాలే అడ్డుకున్నాయని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. యూపీఏ తొమ్మిదేళ్ల పాలనపై బుధవారం ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ సమర్పించిన సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడారు. విపక్షాల నుంచి ఎదురైన పలు అడ్డంకుల కారణంగా కొన్ని పనులు పూర్తిగా చేయలేకపోయామని పేర్కొన్నారు. యూపీఏ-2 పాలనలో అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి ఫలాలు అందుకున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభివృద్ధిలో యూపీఏ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతల నుంచి పక్కకు జరగలేదని స్పష్టం చేశారు. ఆహార భద్రత, భూసేకరణ బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. అవినీతి నిర్మూలనలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ యూపీఏ పాలన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదిక సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయని అన్నారు. దేశం ఆర్థికంగా బలపడిందని, ధరలను నియంత్రించగలిగామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఆర్థికాభివృద్ధి ఆరు శాతం కన్నా ఎక్కువగానే ఉందని, 2013-14లో వృద్ధిరేటు మరింత మెరుగవుతుందని తెలిపారు. ద్రవ్యలోటును సమర్థవంతంగా నియంత్రించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తామన్నారు. ఇకపై అవినీతి ఆరోపణలను ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిపై పోరాటం కోసం లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. వెనుబడ్డ రాష్ట్రాలనె అభివృద్ధి చేశామన్నారు. అయినా ఇప్పటికీ సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. తమ పాలనపై వచ్చే ఏడాది నేరుగా ప్రజల వద్దకు వెళ్తామన్నారు. స్పెక్ట్రం విషయంలో భవిష్యత్తులోనూ సమస్యలు తలెత్తకుండా వ్యవస్థను రూపొందించామని పేర్కొన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా భాగస్వామ్యపక్షాలకు ప్రధాని విందు ఇచ్చారు. ఈ విందులో యూపీఏకు బయటినుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ పాల్గొనలేదు.