ప్రచారంలో కిరణ్‌బేడీ ఉద్వేగం

5
కన్నీరు పెట్టుకున్న భాజపా సీఎం అభ్యర్థి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): కరుడుగట్టిన నేరస్థులను సైతం కళ్ల చూసిన ఈ మాజీ పోలీస్‌ ప్రజల అభిమానంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్విగ్నాన్ని అణచుకోలేక కంటతడిపెట్టారు.  దిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీ బుధవారం  ఎన్నికల ప్రచార ర్యాలీలో కంటతడి పెట్టారు. ఫిబ్రవరి 7న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా కిరణ్‌బేడీ కృష్ణనగర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. దిల్లీ ప్రజల ఆదరాభిమానాలు చూసి చలించిపోయిన కిరణ్‌బేదీ కంట తడి పెట్టారు. ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వారికి సేవచేయడం ద్వారా రుణం తీర్చుకుంటానని అన్నారు. తనను ఆదరిస్తున్న ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అన్నారు. అందుకే సేవ  చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు. బుధవారం తాను పోటీ చేస్తున్న కృష్ణనగర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సందోహాన్ని చూసిన కిరణ్‌ బేడీ ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు.  ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరవలేవని ఆమె అన్నారు.మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు ఇటీవలి సర్వేల్లో తేలగా, తాజాగా ఆప్‌ అధికారానికి చేరువకానున్నట్టు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఆప్‌ కన్వీనర్‌, తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు  దక్కనున్నట్టు తెలిపాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఆప్‌ మెజార్టీకి చేరువకాగా, బీజేపీ కాస్త తేడాతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఆప్‌కు పట్టం కట్టనున్నారని సర్వేలు తేల్చడంతో బీజేపీ అగ్రనాయకత్వంలో ఆందోళన మొదలైంది. ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్ది తుది వ్యూహాల్లో బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో మోడీ టీమ్‌ ఉంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ ఆఫీసులో గోయల్‌, నిర్మలాసీతారామన్‌, రవిశంకర్‌ప్రసాద్‌ సమావేశమయ్యారు. ఎన్నికల తుది వ్యూహంపై కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది.