ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

వరంగల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నారు. సరైన వైద్యసేవలు అందడంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తగు విధంగా వైద్యులు స్పందించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని హితువుపలికారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని సూచించారు. సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతో వైద్యసిబ్బందిపై పర్యవేక్షణ జరపాలని పేర్కొన్నారు. తానూ ఆసుపత్రులను సందర్శిస్తానని చెప్పారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్యశాలల్లో పని చేసే వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించకపోయినా, విధులు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తరువాత ప్రతి జిల్లా అధికారికి అన్ని ఆరోగ్య కేంద్రాలపై అవగాహన పెరిగిందన్నారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరును సవిూక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులతోపాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రతి జిల్లాకు ముగ్గురు ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందం ప్రతి రోజు సవిూక్షి స్తుందన్నారు. పనితీరుపై నివేధికలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆరోగ్యశాఖకు అందిస్తున్నారన్నారు.

కమలాపూర్‌లో రూ.4 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 పడకల ఆస్పత్రి భవనం వైద్యులు, సిబ్బందితో పాటు అన్ని వసతులు కల్పించిన తరువాతే ప్రారంభిస్తామని అన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఆరోగ్యశాఖలో ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంందని ఆయన పేర్కొన్నారు.