ప్రజలపై పన్నులు వేస్తే ప్రజా ఉద్యమం చేపడతాం : షబ్బీర్ అలీ
హైదరాబాద్: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు.గురువారం మండలి ఛైర్మన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరిన ఫారూక్‌హుస్సేన్, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్‌అలీ కోరారు. 48 నెలల పాలనలో 47మందిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, టీడీపీ నుంచి గెలిచిన తలసాని అనైతికంగా మంత్రిగా కొనసాగుతున్నారని ఆయన ఆరోపించారు. రంగులు మార్చే నేతలు ఏ పార్టీలో ఉండొద్దన్నారు. టీఎస్ ఆర్టీసీని మూసేస్తామని కేసీఆర్ కార్మికులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఎలాంటి పన్నులు లేకుండా పాలిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రూ.1500కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపబోతున్నారని, ప్రజలపై పన్నులు వేస్తే ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. చార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ డిమాండు చేశారు.