ప్రజల ఇక్కట్లను పరిష్కరించండి: గుండా మల్లేశ్
ఆదిలాబాద్,నవంబర్30(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేషం అన్నారు. పోరుబాట ముగింపు సందర్భంగా డిసెంబర్ 3న కరీంనగర్‌లో సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై అందులో చర్చిస్తామని గురువారం నాడిక్కడ అన్నారు. ఉపాధి హావిూ కార్మికులకు 300 రోజలు పనిదినాలు కల్పించి వారికి రోజుకు రూ.310 కూలీగా చెల్లించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిహావిూ కూలీలకు వారం కోసారి కూలీడబ్బులు చెల్లించాల్సి ఉండగా మూడు, నాలుగు నెలలకోసారి కూలీలు అందించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దళితులకు ప్రభుత్వం అందించే భూమి కొనుగోలు పథకంలో మొదటి ప్రాధాన్యంగా అందించాలన్నారు. కార్మికులకు రెండుపడకల గదుల ఇళ్లను అందించి వారిని ఆదుకోవాలన్నారు. కార్మికులకు సంక్షేమ ఫలాలు అందకుంటే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇకపోతే టైగర్ జోన్ పేరిట అడవుల నుంచి గిరిజనులను పంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జిల్లాలో 2,600 ఎకరాల్లో పోడు భూములున్నాయని, వాటిని గిరిజనుల నుంచి లాక్కునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. గిరిజనులంతా ఏకమై పోరాటాలకు దిగాలని సూచించారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెబుతున్న పాలకులు భూములు పంపిణీ చేయడం పక్కన బెడితే ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కప్పిపుచ్చుకోవడానికి భాజపా, సంఘ్ పరివార్‌లు మతతత్వ విద్వేషాల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. లక్షల కోట్ల రూపాయలను ఎగవేసి దేశం
విడిచి పారిపోయిన విజయ్‌మాల్యా లాంటివాళ్లను శిక్షించకుండా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జిఎస్టీ,నోట్ల రద్దు కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు సమర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం పని చేసిందని, తద్వారా సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని మల్లేశం ఆరోపించారు.