` ప్రజల వద్దకే పాలన అందిస్తాం
` గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం
` రేషన్‌కార్డులు నిరంతరం జారీ చేస్తాం
` ఇప్పటికైతే రైతుబంధుకు పరిమితిలేదు
` అభయహస్తం దరఖాస్తు..లోగో విడుదల
` నేటినుంచే గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ
` సచివాలయంలో విడుదల చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్,డిసెంబ్27(జనంసాక్షి):తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రుల సమక్షంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల ప్రొఫార్మాను రూపొందించారు. గురువారం28 వతేదీనుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేసి ప్రజలకు భరోసా ఇచ్చారు. డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలకు మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 7లోపు లబ్దిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుంది. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ మండలంలో రెండు గ్రూపులుంటాయని.. ఒకటి..ఎండీవో..మరొకటి ఎమ్మార్వో అని చెప్పారు. గ్రామసభల్లో మహిళలకు, పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు. గ్రామసభల్లో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్లు తహసీల్దార్, పంచాయితీ ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో వేల ధరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎక్కువుగా భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానే ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాలుగు పేజీల అభయ హస్తం దరఖాస్తులో వివఆలు ఇలావున్నాయి. దఖాస్తుదారుని పేరు, లింగ నిర్థారణ, కులం వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.దరఖాస్తుదారుని పూర్తి చిరునామా.. ఇంటి నెంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు నెంబర్, మండలం, జిల్లా వివరాలు నమోదు చేయాలి. మహాలక్ష్మి పథకం వివరాలు ఉంటాయి. ప్రతినెలా 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం అవసరమా లేదా అనే కాలం ఉంటుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగించుకుంటున్నారు అనే సంఖ్య ఇవ్వాలి. రైతుభరోసా కిందరైతునా.. కౌలు రైతునా అనే వివరాలు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు అయిన సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా ఇచ్చే 12 వేల రూపాయలకు సంబంధించి ఉపాధి హావిూ కార్డు నెంబర్ నమోదు చేయాలి. ఇల్లులేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఉంది. అమరవీరులు,ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అమరవీరుల పేరు, అమరలైన సంవత్సరం.. ఎఫ్‌ఐఆర్ నెబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్ నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనే వివరాలు ఇవ్వాలి. ఒక వేళ జైలుకు వెళ్లినట్లయితే జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు.. శిక్షా కాలం వివరాలు నమోదు చేయాలి. గృహ జ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. విూ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది. 100 యూనిట్ల.. 200 యూనిట్ల, 200 యూనిట్లపైన ఉంటుందా అనేది నమోదు చేయాలి. అదే విధంగా కరెంట్ విూటర్ కనెక్షన్ సంఖ్య నమోదు చేయాలి. చేయూత పథకం కింద నెలకు 4 వేలు మరియు దివ్యాంగుల పింఛన్ 6 వేలు పొందేందుకు వివరాలను తెలపాలి. ప్రస్తుతం ఫించన్ పొందుతున్న వారు కొత్తగా దరఖాస్తు నమోదు చేయాల్సిన అవసరం లేదు. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ నెంబర్. ఇతరులు అయితే వృద్యాప్య పింఛన్, వింతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, ్గªల్గªలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టెకేదార్ జీవన భీతి వివరాలు నమోదు చేయాలి. ఏ పథకం కింద అర్హులో నమోదు చేయాల్సి ఉంటుంది. రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటంపై వస్తున్న విమర్శలపై సిఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని.. ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ లకు చురకలు అంటించారు. ఇకపోతే ల్గªతుబంధుకు ఎలాంటి పరిమితి విధించలేదన్నారు.
ఆదాయ,వ్యయాల వాస్తవాలు చెబుతాం
` ఆర్థిక పరిస్థితిపై సత్యాన్నే వెల్లడిస్తాం
` కేంద్రం నిధులను నూటికి నూరు పాళ్లు వాడుకోవాలి
` ప్రజలకు జవాబుదారీగా వచ్చే వార్షిక బడ్జెట్
` ఆర్థిక శాఖ సవిూక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): 2024`25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సవిూక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదాం. తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలి. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలి. హావిూల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి.దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలకు పోవద్దు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే వాడుకోవాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సవిూక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హావిూలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు. తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలువకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ కె.హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.