ప్రజల పక్షానే ఉన్నాం
– ప్రొఫెసర్ కోదండరాం
ఖమ్మం,ఆగస్టు 8(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సమయంలో పోషించిన పాత్రనే… తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ పోషిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని గతంలో చెప్పిన విధంగానే ఇప్పుడు చేస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం ఖమ్మం ధర్నా చౌక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ అని కోదండరాం కొనియాడారు. స్త్రీల ఉద్యమాలకు ఐలమ్మ ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు హైకోర్టు జడ్జి చంద్రకుమార్, ప్రొ.తిరుమలి, సాంబశివరావు, బీసీ ఫ్రంట్ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కంటే ముందు జిల్లా ఐకాస సమావేశం జరిగింది. ప్రజల కేంద్రంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి కోసం తెలంగాణలో జేఏసీలను మరింత బలోపేతం చేస్తామని కోదండరాం తెలిపారు. జిల్లా జేఏసీ నూతన కన్వీనర్‌గా డా.పాపారావు, కోకన్వీనర్‌గా మల్లెల రామనాధంను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వారి నేతృత్వంలో జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు ఐక్యంగా పనిచేస్తాయని వివరించారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు ఇకముందు మరింతగా పోరాడుతామని అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఆనాడు, ఆనాడు కూడా తమ విధానం అదేనని అన్నారు.