ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న కేంద్రం

యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తోంది. టీ కాంగ్రెస్‌ ఎంపీల డిమాండ్‌ మేరకు ఈనెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈమేరకు హోం శాఖ అదనపు కార్యదర్శి స్కందన్‌ రాష్ట్రంలోని తొమ్మిది రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరుకావాలని లేఖలో పేర్కొంది. రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలకు లేఖలు రాసింది. వీటిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్తగా అఖిలపక్షానికి వెళ్తుండగా, గతంలో అఖిలపక్షానికి వెళ్లిన ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో వీలనమైపోయింది. అప్పుడు ఆహ్వానం అందని లోక్‌సత్తా పార్టీకి కేంద్రం కొత్తగా లేఖ రాసింది.  తెలంగాణ ప్రాంతంలో తాము తిరగలేని పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారని ఈ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో గొంతెత్తి చెప్పారు. వివిధ మార్గాల్లో నిరసన తెలిపిన ఎంపీలు అధినేత్రి సోనియాగాంధీని కలిసి తమ బాధలను వివరించారు. తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ సందర్భంగా ఎంపీల అవసరమై అధిష్టానం దిగివచ్చింది. వారి విజ్ఞప్తి మేరకు ఈనెల 28న అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అఖిలపక్షాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర పార్టీలన్నీ ఏకమై ముఖ్యమంత్రితో ఢిల్లీలో మంత్రాంగం నడిపింది. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ సీఎం కిరణ్‌ రెండు రోజులు హస్తినలో ఉండి లాబీయింగ్‌ చేశాడు. అయినా హోం మంత్రి ఏమాత్రం తగ్గకుండా సంప్రదింపుల ప్రక్రియను ఆపబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఒకింత ఊరటనిచ్చినా, పార్టీలకు రాసిన లేఖలను చూస్తే తెలంగాణ ప్రజల గుండెలు చెదిరిపోయాయి. కేంద్రం దాగుడు మూతలు, దొంగాటలు ఇంకా కొనసాగించబోతుందని స్పష్టం అయింది. అసలు తెలంగాణ సమస్యకు ఒక ముగింపు ఇవ్వాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ఏమాత్రం లేదు. 2010లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీల్లో టీఆర్‌ఎస్‌, సీపీఐ మినహా మిగతా పార్టీలన్నీ రెండు రాగాలు ఆలపించాయి. ప్రాంతాల వారీగా హాజరైన ప్రతినిధులు తమ ప్రాంత ప్రజల మనోభావాలంటూ చెప్పుకున్నారే తప్ప పార్టీల అభిప్రాయం చెప్పనేలేదు. మీటింగ్‌ ముగిసిన తర్వాత కూడా మీడియా ప్రతినిధుల ఎదుట అదే విషయం ప్రకటించారు. పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి కాబట్టి ఏకాభిప్రాయం వచ్చే వరకు తెలంగాణపై తేల్చబోమంటూ చేతులెత్తేసింది. సంప్రదింపుల ప్రక్రియకు కాలపరిమితి అంటూ ఏమీ లేదు. అంటే ఎంతకాలమైనా సంప్రదింపులు కొనసాగించవచ్చు. కేంద్రంలో హోం మంత్రి మారిన ప్రతిసారి అఖిలపక్షం అంటే ఎలా అని కొన్ని పార్టీల ప్రతినిధులు ఇప్పటికే పెదవి విరిచారు. తెలంగాణ ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులేమిటి? నిజంగా అడ్డంకులే ఉంటే 2004 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న టీఆర్‌ఎస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకుంది? తెలంగాణ అంశాన్ని యూపీఏ-1 కామన్‌ మినిమం ప్రోగ్రాంలో ఎందుకు చేర్చింది? రాష్ట్రపతి ప్రసంగంలో ఎందుకు చెప్పించింది? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. సమాధానం లేవనేవి అనేకంటే సమాధానం చెప్పడం లేనివి అనడం సముచితం. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని రోడ్లపైకి వచ్చి పోరాటాలు సాగించారు. 40 రోజులకు పైగా సకల జనుల సమ్మె చేసి తమ ఆకాంక్ష ఎంత బలీయమైనదో చాటిచెప్పారు. సింగరేణి గనుల్లో అన్ని రోజులు తంటా బొగ్గు తీయలేదంటే ప్రజల మనోభావం ఎంటో అర్థం కావడం లేదా? ఆర్టీసీ బస్సులు రోడ్లమీద తిరగలేదంటే తమ న్యాయమైన డిమాండ్‌ చెప్పడానికి మరే మార్గాన్ని అనుసరించాలి? 900 మందికి పైగా విద్యార్థులు, యువకులు లేఖలు రాసి మరీ ఆత్మబలిదానాలు చేసుకున్నారంటే ఇక్కడి ప్రజల మనసులు ఎంత సున్నితమైనవో తెలియడం లేదా? వారి ఆకాంక్ష ఎంత సున్నితమైనదో అర్థం కావడం లేదా? యూపీఏ అధినాయకత్వానికి ఇవేవి తెలియక కాదు. తాము ఏం చేసినా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది వారి అభిమతం. అందుకోసం ఎన్ని కుయుక్తులు పన్నడానికైనా, ఎందరి మనోభావాలను వంచిండానికైనా వెనుకాడబోరు. బుధవారం రాసిన లేఖలతో ఈ విషయం మరోసారి సుస్పష్టమైంది.