ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ రాస్తారోకో
నిజామాబాద్, జనవరి 29 (): తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.బి రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో విఫలం చెందారని వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేసి ప్రజాక్షేతంలో కలవాలని డిమాండ్ చేశారు. 1969,1956 సంవత్సరాలలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులను తుపాకి తూటాలకు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009 నుండి పూటకో మాటతో తెలంగాణవాదులను మోసగిస్తుందన్నారు. అయినా సిగ్గులేని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను చూసి అయిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజల మధ్యకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదవులు వదులుకోకుంటే తెలంగాణలో తిరగనివ్వమని, కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా బహిష్కరించాలని కోరారు. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నగర ప్రధాన కార్యదర్శి జి. అన్వేష్, ఉపాధ్యక్షురాలు ఎన్.సౌందర్య, నాయకులు గణేష్, అరుణ్, మీనా, సౌందర్య, విజయ్, ప్రశాంత్, వి.పి రాజు, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.